Chandrababu Writes: ఏపీ ఆక్వా రంగం సంక్షోభం: కేంద్ర మంత్రులకు చంద్రబాబు లేఖలు
చంద్రబాబు లేఖలు

Chandrababu Writes: ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వాకల్చర్ రంగం మరియు రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఈ సందర్భంగా ముగ్గురు కేంద్ర మంత్రులకు వేర్వేరు లేఖలు రాశారు.
జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్‌ను దిగుమతి చేసుకొని రొయ్యల మేత తయారీదారులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌ను సీఎం కోరారు. ఆక్వా రంగాన్ని కాపాడటానికి తగిన చర్యలు తీసుకోవాలని, ఏపీ నుంచి ఎఫ్‌సీవీ పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు అందించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే, ఆక్వా రంగంపై విధించిన జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.
అమరావతిలో ఎన్‌ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు
రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, ఎప్పటికప్పుడు సహాయం అందించడానికి జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) ప్రాంతీయ కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు మరో లేఖలో రాజీవ్ రంజన్ సింగ్‌ను కోరారు.
ఈ ఏడాది జూన్ 5న విశాఖపట్నంలో జరిగిన సీఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ వర్క్‌షాప్‌లో ఈ కార్యాలయం ఏర్పాటుకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాజధాని పరిధిలోని నెక్కల్లులో 7.89 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించామన్నారు. తక్షణం ఆ భూమిని స్వాధీనం చేసుకుని నిర్మాణాలు ప్రారంభించాలని, 2028 నాటికి ప్రాంతీయ కార్యాలయం, అక్వేరియం, శిక్షణ కేంద్రాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేంద్రం బ్లూ ఎకానమీ అభివృద్ధికి కీలక కేంద్రంగా మారుతుందని సీఎం తెలిపారు.

