AP Cabinet: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చే 30 అంశాల అజెండాకు ఆమోదం తెలిపారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్న ఆరు సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ ఆరు సంస్థల ద్వారా దాదాపు రూ.36 వేల కోట్ల పెట్టుబడులు వచ్చి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిర్ణయించారు.

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో రూ.19 వేల కోట్లతో కియా రెండో ఆటోమొబైల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. శ్రీకాకుళంలో రూ.13,667 కోట్లతో అదానీ ఇంటిగ్రేటెడ్ టైటానియం కాంప్లెక్స్‌కు పచ్చజెండా ఊపారు. అచ్యుతాపురంలో రూ.1,800 కోట్లతో సెయింట్ గోబైన్ ఫ్లోట్ గ్లాస్ తయారీ పరిశ్రమకు ఆమోదం లభించింది. పరిశ్రమల ఏర్పాటులో జాప్యం నివారించేలా ఏపీ ఎంఎస్ఎంఈ రైట్ టు బిజినెస్ బిల్లు-2026కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ నిర్మాణ పనులకు భారీగా నిధులు కేటాయించారు. సమీకృత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణ వ్యయాన్ని రూ.4,688 కోట్ల నుంచి రూ.6,641 కోట్లకు పెంచారు. అమరావతిలో గ్రామ పంచాయతీల మౌలిక వసతుల అభివృద్ధికి రూ.1,215 కోట్ల పనులకు ఆమోదం తెలిపారు. శాఖమూరులో అమరావతి సంగమం నిర్మాణానికి రూ.626 కోట్ల ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రాజధానిలో గ్రీన్ వర్క్స్ ప్యాకేజీ-2 కింద రూ.180.68 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది.

.రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం కోల్ ఇండియాతో జాయింట్ వెంచర్ ఏర్పాటుకు ఏపీజెన్‌కోకు అనుమతి ఇచ్చారు. కడప జిల్లా మైలవరంలో 1,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు 1,127 ఎకరాల భూమి కేటాయించారు. నంద్యాల జిల్లాలో 210 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు బదిలీకి అనుమతి ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో రోజుకు 12 టన్నుల సామర్థ్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.అనంతపురం జిల్లాలో 9,917 ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

అనంతపురం జిల్లాలో 4,352 మంది పట్టాదారులకు ప్రయోజనం కలిగేలా భూ రికార్డుల సవరణకు అనుమతి ఇచ్చారు. రైల్వేకోడూరు పరిధిలో 10,192 ఎకరాల భూములకు సంబంధించి వెబ్‌ల్యాండ్ రికార్డుల సవరణకు పచ్చజెండా ఊపారు. భూ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ, అసైన్డ్, వివాదాస్పద భూములకు కొత్త హక్కులు కల్పించరాదని స్పష్టమైన నిబంధనలు విధించారు.ఈ నిర్ణయాలు రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, రాజధాని అభివృద్ధికి ఊతమిస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాబోయే రోజుల్లో అమలు దశకు చేరతాయి.

Next Story