AP CM Chandrababu Holds Key Meetings at Davos: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌లో కీలక భేటీలు: అమరావతిని సైబర్ సెక్యూరిటీ నగరంగా తీర్చిదిద్దాలని ఇజ్రాయెల్‌ను కోరిన సీఎం
అమరావతిని సైబర్ సెక్యూరిటీ నగరంగా తీర్చిదిద్దాలని ఇజ్రాయెల్‌ను కోరిన సీఎం
AP CM Chandrababu Holds Key Meetings at Davos: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు, సాంకేతిక సహకారం ఆకర్షించడమే ఈ పర్యటన లక్ష్యం.
ముఖ్యంగా, అమరావతిని సైబర్ సెక్యూరిటీ నగరంగా అభివృద్ధి చేయడంలో సాంకేతిక సహకారం అందించాలని ఇజ్రాయెల్ ప్రతినిధి బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు. ఇజ్రాయెల్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్ బరక్కత్, ట్రేడ్ కమిషనర్ గోయ్ ఫిషర్, స్విట్జర్లాండ్‌లోని ఇజ్రాయెల్ ట్రేడ్ మిషన్ ప్రతినిధి షిర్ స్లట్కీతో ఆయన సమావేశమయ్యారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో డ్రోన్ తయారీ, తీర ప్రాంత గస్తీ, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం వంటి సాంకేతికతలు అందించే విషయంపై చర్చ జరిగింది. అలాగే, డీశాలినేషన్ (సముద్ర నీటి నుంచి తాగునీరు తయారీ), పారిశ్రామిక అవసరాలకు వ్యర్థ జలాల రీసైక్లింగ్ సాంకేతికతలపై సహకారం కోరారు. క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ల తయారీ రంగాల్లో ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేయాలని, జపాన్, కొరియా మాదిరిగా ఇజ్రాయెల్ పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు.
ఇజ్రాయెల్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్ బరక్కత్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మీయ కరచాలనం చేసుకున్నారు.
స్విట్జర్లాండ్ ప్రతినిధి బృందంతో కూడా సీఎం భేటీ అయ్యారు. ఏపీ-స్విట్జర్లాండ్ మధ్య వాణిజ్య సంబంధాలు, స్విస్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణ అంశాలపై చర్చించారు. స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవస్థ కార్యదర్శి హెలెనే బడ్లిగర్ ఆర్టీడా, ఆర్థిక వ్యవహారాల ప్రతినిధి అంబాసిడర్ ఆండ్రియా రౌబర్, స్విస్ పార్లమెంటు సభ్యుడు నిక్ గుగ్గర్, సీకో సలహాదారు మార్టీనా బైటెన్షాదర్‌లతో సమావేశమయ్యారు. స్విస్ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి హెలెనే బడ్లిగర్ ఆర్టీడాను సత్కరించిన సందర్భంలో స్విస్ ఎంపీ నిక్ గగ్గర్, ఆర్థిక వ్యవహారాల ప్రతినిధి, రాయబారి ఆండ్రియా రౌబర్ కూడా ఉన్నారు.
దావోస్ పర్యటన మూడో రోజు (బుధవారం) కూడా సీఎం బిజీగా ఉన్నారు. ప్రముఖ కంపెనీల సీఈఓలతో ముఖాముఖి భేటీలు, వరల్డ్ ఎకనమిక్ ఫోరం కాంగ్రెస్‌లో పారిశ్రామిక పురోగతిపై సెషన్‌లో పాల్గొన్నారు. హురైసిస్ ఛైర్మన్ ఫ్రాంక్ రిచర్‌తో సమావేశం, తమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్ సృష్టి శిబులాల్, సీఓఓ ఖష్బూ అవస్థితో చర్చలు జరిగాయి. కాలిబో ఏఐ అకాడమీ సీఈవో రాజ్ వట్టికుట్టితో కలిసి సమావేశమయ్యారు. ఏపీ సీఎన్‌ఎఫ్ నిర్వహించే 'హీలింగ్ ప్లానెట్ త్రూ రీజనరేటివ్ పుడ్ సిస్టమ్స్' చర్చలో పాల్గొన్నారు. 'ట్రిలియన్ డాలర్ పివోట్ రీరైటింగ్ మార్కెట్ సిగ్నల్స్ ఫర్ నేచర్ పాజిటివ్ గ్రోత్' అంశంపై చర్చలో పాల్గొన్నారు. బ్లూమ్‌బర్గ్ సంస్థ నిర్వహించే 'ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏఐ మూవ్‌మెంట్ ట్రాన్స్‌ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ' సెషన్‌లో ముఖ్యవక్తగా ప్రసంగించారు. ఏపీ లాంజ్‌లో 'బిల్డింగ్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొన్నారు. వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్, రీజనరేషన్ మొబిలైజింగ్ కేపిటల్ కార్యక్రమానికి హాజరయ్యారు.
దావోస్‌లో మంత్రి నారా లోకేశ్ ఐరన్ మౌంటెన్ ప్రెసిడెంట్, సీఈవో విలియం ఎల్. మీనీతో భేటీ అయ్యారు.
ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా ప్రమోట్ చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు.




