రెండు మూడేళ్లలో మరింత అద్భుతంగా మారుస్తాం

AP CM Chandrababu: రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక, అభివృద్ధి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇది మెరుగైన బడ్జెట్‌గా ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రెండు మూడేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడి, ఇంకా ఉత్తమమైన బడ్జెట్‌ను సమర్పించగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

వైకాపా పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని చంద్రబాబు అన్నారు. ఆదాయం తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉండే వారసత్వ సమస్యలను ఎదుర్కొంటూ, కేంద్ర సహకారంతో జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నామని వివరించారు. ఇబ్బందులను అధిగమించి ఇప్పుడిప్పుడే రాష్ట్రం సరైన ట్రాక్‌పైకి వస్తోందని, అయితే ఇంకా చాలా సవాళ్లు మిగిలి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

వ్యవసాయం, సేవా రంగాల నుంచి ఎక్కువ ఆదాయం తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అమరావతి రాజధానికి రెండు మూడేళ్లలో మంచి రూపురేఖలు వస్తాయని, రోడ్లను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. పశ్చిమ బైపాస్‌తో యాక్సెస్ పెరిగిందని, ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లతో మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు. దీంతో రాకపోకలు పెరిగి ఆదాయం కూడా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చినది తామే అని చంద్రబాబు గుర్తు చేశారు. హార్టికల్చర్ హబ్‌కు రూ.30 వేల కోట్లు కేటాయించడం సంతోషకరమని అన్నారు. గతంలో రాయలసీమలో పశువులకు నీరు కూడా దొరకని పరిస్థితి ఉండేదని, రెయిన్ గన్స్‌తో పంటలు కాపాడుకునే దుస్థితి ఉండేదని గుర్తుచేశారు. హంద్రీ-నీవా ప్రాజెక్టును సీరియస్‌గా తీసుకుని రాయలసీమను మార్చేశామని, ఇప్పుడు దేశంలోనే నాణ్యమైన పండ్లు ఇక్కడి నుంచి వస్తున్నాయని, దానిమ్మకు మంచి డిమాండ్ ఉందని చెప్పారు.

ఎమ్మెల్యేల పనితీరును సర్వే చేసి సీల్డ్ కవర్‌లో నివేదికలు ఇస్తున్నామని, 9 పారామీటర్లతో పాటు ఇంకా కొన్ని రహస్య పారామీటర్లు కూడా ఉన్నాయని తెలిపారు. గతంలోలాగే నిక్కచ్చిగా, నిజాయితీగా ఉంటానని, మారకపోతే వారికే నష్టమని ఆయన స్పష్టం చేశారు. లోకేశ్ తన పని తాను చేస్తున్నారని, నేతలతో మానవీయ సంబంధాలు, మోటివేషన్ ఉండాలని, భయం-భక్తి కలిగిన బంధం ఏర్పడాలని అన్నారు. మంగళగిరి చీరల బ్రాండింగ్‌లో లోకేశ్ బాగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

ఈ వ్యాఖ్యలు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశం నేపథ్యంలో చంద్రబాబు చేశారు. ప్రస్తుత బడ్జెట్ రాష్ట్రానికి బలమైన పునాది వేస్తుందని, భవిష్యత్తులో మరింత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థకు దారితీస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story