AP Deputy Chief Minister Pawan Kalyan: వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి పూర్తిగా కల్తీదని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) తేల్చి చెప్పింది. రసాయనాలు, పామాయిల్ వంటివి కలిపి తయారు చేసిన నూనెతో లడ్డూలు తయారీ చేయడం వల్ల కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. భక్తుల భావాలను గౌరవిస్తూ జంతు కొవ్వు కలిసిందా లేదా అనే విషయాన్ని సిట్ బయటపెట్టలేదు. ఈ విషయంలో వైకాపా నేతలు గోబెల్స్ తరహా ప్రచారం చేస్తున్నారని, అబద్ధాలు, బుకాయింపులతో తప్పించుకోవాలని చూస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అబద్ధ ప్రచారాన్ని అడ్డుకోవాలంటే వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం జరిగిన జనసేన సర్వసభ్య సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, వైకాపా నేతలతో తనకు వ్యక్తిగత ద్వేషం లేదని, కానీ వారి భాషా శైలి, నేరపూరిత స్వభావం సమస్యగా మారిందని అన్నారు. 'ఇళ్లలోకి వచ్చి దాడి చేస్తాం, నరికేస్తాం' అంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడటం వల్లే ఇప్పుడు దాడులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. హింసా దాడులను ఏ రాజకీయ పార్టీ సమర్థించదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని చెబుతున్నారని వివరించారు. వైకాపా నేతలు ప్రజల్లో భయాన్ని సృష్టిస్తూ, మళ్లీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో అంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. గతంలో వారి ప్రవర్తన వల్లే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారని, రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. మరో 15 ఏళ్లు కూటమి అధికారానికి ఎలాంటి ఢోకా లేదని, ప్రజలు ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

కాగా, వైకాపా పాలనలో తిరుమలలో కాసులకు కక్కుర్తి పడి మహాపచారం జరిగిందని పవన్ ఆరోపించారు. నిబంధనలను తుంగలో తొక్కేసి టన్నుల కొద్దీ కల్తీ నెయ్యిని కొనుగోలు చేసి ప్రసాదాల్లో కలిపారని విమర్శించారు. రూ.400కు కిలో నాణ్యమైన నువ్వుల నూనె కూడా దొరకదు కదా, అలాంటిది నెయ్యి ఎలా వస్తుందని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టమొచ్చినట్లు చేసి, ఇప్పుడు అబద్ధాలతో తప్పించుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ అపరాధాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని జనసేన శ్రేణులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రారంభోపన్యాసం చేశారు. పార్టీ కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పదవులకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని పవన్ నిర్ణయించారు. పిఠాపురం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఇలా అమలు చేశామని, అన్ని చోట్లా ఇదే పద్ధతి అనుసరిస్తామని చెప్పారు. జిల్లాలను జోన్లుగా విభజించి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని సూచించారు. మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని 'జెన్ జి డే'గా జరపడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సామాజిక మాధ్యమాలు గెలుపు-ఓటములను నిర్ణయించే ఆయుధం కాదని, అవి గెలుపుకు ఒక కారణం మాత్రమేనని పవన్ కల్యాణ్ వివరించారు. సామాజిక మాధ్యమాలే అన్నీ అనుకుంటే అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ఎలా గెలిచారని ప్రశ్నించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story