AP Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శనివారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. కాకినాడలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం రాజమహేంద్రవరం వచ్చి ధవళేశ్వరంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంకును ప్రారంభించారు.

ఈ సందర్భంగా తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి బ్యాంకును పరిశీలించారు. వివిధ ప్రాంతాల కళాకృతులను చూసి, వాటి తయారీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అగ్గిపెట్టెలో పట్టేలా రూపొందించిన చిన్న కళారూపాన్ని పవన్‌ దంపతులు ఆసక్తిగా తిలకించారు. అన్నా కొణిదెల పలు కళాకృతులను కొనుగోలు చేశారు. చేతివృత్తి కళాకారులను పవన్‌ అభినందించి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్‌, ఎమ్మెల్యే గోరంట్ల, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆరు ప్రధాన క్లస్టర్ల పరిధిలో ఏర్పాటైన క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంకులకు పవన్‌ వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు. ఈ బ్యాంకులు 5,000 హస్తకళాకారుల కుటుంబాలకు కలప కొరత సమస్య నుంచి విముక్తి కలిగించనున్నాయి. రాజమహేంద్రవరం సెంట్రల్‌ క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంకులో ప్రస్తుతం 30 క్యూబిక్‌ మీటర్ల కలపను అందుబాటులో ఉంచారు. వచ్చే ఐదేళ్లకు సరిపడా కలపను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు.

అయితే ఈ కార్యక్రమం సమయంలో పవన్‌కు తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించుకుని వెళ్లిపోయారు. రాజమహేంద్రవరంలో వైద్యులు పరీక్షలు నిర్వహించి పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు. ఫలితంగా శనివారం సాయంత్రం లోక్‌ భవన్‌లో నిర్వహించాల్సిన ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది. ఇదే విషయాన్ని లోక్‌ భవన్‌ అధికారులకు కూడా తెలియజేశారు. పవన్‌ హైదరాబాద్‌ వెళ్లనున్నారు.

ఇటీవల పవన్‌ కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత చేయించుకోవాల్సిన ఫిజియోథెరపీ గురించి వైద్య నిపుణుల సూచనలు స్వీకరించనున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story