34% BC Reservations: బీసీల 34 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం

34% BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఢిల్లీలోని న్యాయ నిపుణులను సంప్రదించి, పంచాయతీరాజ్, పురపాలక శాఖ తరఫున వాదించేందుకు సీనియర్ న్యాయవాదులను నియమించారు. ఈ వారం పిటిషన్ దాఖలు చేస్తే వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో శనివారమే ఫైల్ చేయాలని సీఎం సూచించారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

