కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

AP Government: విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు టెండర్లలో జాయింట్ వెంచర్స్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్పీ రామకృష్ణా రెడ్డి తెలిపారు. గరిష్టంగా మూడు కంపెనీలు కలిసి జాయింట్ వెంచర్‌గా టెండర్లలో పాల్గొనే వీలు కల్పించామని ఆయన స్పష్టం చేశారు. ప్రీ-బిడ్ మీటింగ్‌లో కాంట్రాక్ట్ సంస్థల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ నిర్ణయంతో ఎక్కువ కంపెనీలు టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.

పనులను చిన్న చిన్న ప్యాకేజీలుగా విభజిస్తే ప్రాజెక్ట్ ఆలస్యమవడంతో పాటు నిర్మాణ వ్యయం గణనీయంగా పెరుగుతుందని రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ఇతర మెట్రో ప్రాజెక్టుల అధ్యయనం ఆధారంగా పనులను చిన్న ప్యాకేజీలుగా విభజించకూడదని నిర్ణయించామని చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా రెండు ప్రాజెక్టులను రికార్డు సమయంలో పూర్తి చేసి, నిర్మాణ వ్యయాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.

విశాఖపట్నంలో 46.23 కి.మీ., విజయవాడలో 38 కి.మీ. మెట్రో సివిల్ పనుల కోసం అంతర్జాతీయ టెండర్లు ఆహ్వానించామని ఆయన తెలిపారు. విశాఖ మెట్రో టెండర్లకు అక్టోబర్ 10, విజయవాడ మెట్రో టెండర్లకు అక్టోబర్ 14 వరకు గడువు పొడిగించినట్లు రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా మెట్రో రైలు ప్రాజెక్టు మంజూరైన విషయం తెలిసిందే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని నేపథ్యంలో, విశాఖ మెట్రో రైలుకు 100 శాతం నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరుతున్నారు. కేంద్రం నుంచి ఆమోదం లభించే వరకు ప్రాజెక్టును పెండింగ్‌లో ఉంచకుండా, మొదటి దశ పనుల కోసం అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ద్వారా టెండర్లను ఆహ్వానించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story