AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికలు: సీట్ల సర్దుబాటుపై కూటమి నేతల తుది చర్చలు
తుది చర్చలు

AP Local Elections: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంపై కూటమి నేతలు బుధవారం మరోసారి సమావేశమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ రావు, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, శివ శంకర్ పాల్గొన్నారు. సీట్ల కేటాయింపుపై నేడు తుది చర్చలు జరగనున్నాయి.
మంగళవారం అర్ధరాత్రి వరకూ కూటమి నేతలు చర్చలు కొనసాగించిన విషయం తెలిసిందే. జనసేన ఆరు కార్పొరేషన్లు, 40 మున్సిపాలిటీలు తమకు కావాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే టీడీపీ మూడు కార్పొరేషన్లు, 15 పురపాలక సంఘాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీకి ఒక కార్పొరేషన్ ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్లు కూడా సమాచారం.
జనసేన నేతలు గత రాత్రి పార్టీ అధినేత పవన్ కల్యాణ్తో మాట్లాడి వస్తామని చెప్పి వెళ్లిపోయారు. ఈరోజు చర్చల్లో ఇరు పక్షాలు కొంత మేరకు సడలింపు చూపాలని భావిస్తున్నట్లు సమాచారం. జనసేన తమకు కావాలని పట్టుబడుతున్న విజయవాడలో అప్పుడే అభ్యర్థిపై నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం జనసేన అధినేత సమక్షంలో వంగవీటి రాధా పార్టీలో చేరనున్నారు. విజయవాడ ఓసీ జనరల్ కావడంతో పొత్తులో తమకు వచ్చే సీటులో పోటీ చేయించేందుకు ఆమెను పార్టీలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇంతలో ఎన్నికల కమిషన్ ప్రెస్మీట్ను ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేసింది.

