AP State Election Commission: ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు ఆటంకాలు లేకుండా చూడాలి: ఏపీ ఎస్ఈసీ కీలక ఆదేశాలు
ఏపీ ఎస్ఈసీ కీలక ఆదేశాలు

AP State Election Commission: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష స్థానాలకు నామినేషన్ల స్వీకరణ గడువు ఈరోజు (శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఏపీ ఎస్ఈసీ) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
నామినేషన్లు వేయకుండా ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఫిర్యాదులు వస్తే వెంటనే ఫిర్యాదుదారులను సంప్రదించి, నామినేషన్ దాఖలు చేసేందుకు అవసరమైన రక్షణ కల్పించాలని రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. గడువులోగా నామినేషన్లు వేయించేలా చూడాలని, అభ్యర్థులకు వ్యక్తిగత భద్రత కల్పించాలని, నామినేషన్ కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని స్పష్టం చేసింది.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్ చంద్ర పునేఠా ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకొని, ఈరోజు సాయంత్రం 5 గంటల్లోపు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ విధానానికి అనుగుణంగా సమర్పించిన నామినేషన్లను స్వీకరించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించాలని అన్నారు.

