AP Tourism : ఏపీ పర్యాటకానికి ఎమర్జింగ్ కోస్టల్ అండ్ హెరిటేజ్ అవార్డు
అవార్డు ప్రకటించిన 10వ ఇంటర్నేషనల్ టూరిజం కాన్ క్లేవ్ అండ్ ట్రావెల్ అవార్డు సంస్థ

- న్యూఢిల్లీలోని లె మెరిడియన్ లో జులై 26న పురస్కారం ప్రదానం
- వివరాలు వెల్లడించిన ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట
ఏపీ పర్యాటకాన్ని ప్రతిష్టాత్మక ఎమర్జింగ్ కోస్టల్ అండ్ హెరిటేజ్ అవార్డు వరించిందని ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న విధానాలు, కొత్త పాలసీలు, విప్లవాత్మక సంస్కరణలు ఈ అవార్డును సాధించి పెట్టాయని వివరించారు. ఈ అవార్డు రావడం రాష్ట్ర పర్యాటక రంగ ప్రతిష్టను మరింత పెంచిందన్నారు. 10వ ఇంటర్నేషనల్ టూరిజం కాన్ క్లేవ్ అండ్ ట్రావెల్ అవార్డ్ (ఐటీసీటీఏ) ఈ పురస్కారాన్ని ప్రకటించిందని, జులై 26న న్యూఢిల్లీలోని లె మెరిడియన్ లో సాయంత్రం 7 గంటలకు ఈ అవార్డు అందించనున్నట్లు ఐసీఎం గ్రూప్ ఎండీ, ఛైర్మన్ అజయ్ గుప్తా మరియు ఐటీసీటీఏ జ్యూరీ సభ్యులు తెలిపారని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి కాట ప్రకటనలో పేర్కొన్నారు. పర్యాటక పరిశ్రమ అభివృద్ధికి చేస్తున్న కృషికి నిదర్శనంగా అవార్డు రావడం సంతోషంగా ఉందని ఆమ్రపాలి అన్నారు. ఢిల్లీలో అవార్డు అందుకోవడానికి తాను వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ అవార్డు ఇచ్చిన ప్రోత్సాహంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిని మరింత అభివృద్ధి చేసి పర్యాటకాంధ్రప్రదేశ్ కు బాటలు వేస్తామన్నారు. ఈ సందర్భంగా పర్యాటక రంగ అభివృద్ధికి పెద్దపీట వేసి అభివృద్ధిలో భాగస్వామ్యులైన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబునాయుడుకు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు, ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీకి, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ కు, పర్యాటక శాఖ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతూ వారి కృషిని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాటకు ఐటీసీటీఏ సంస్థ శుభాకాంక్షలు తెలిపింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి కందుల దుర్గేష్, ఛైర్మన్ నూకసాని బాలాజీ, ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ లకు ఆమ్రపాలి కాటా కృతజ్ఞతలు తెలిపారు.
