APNGOs: ఆర్టీసీ ఉద్యోగుల న్యాయ డిమాండ్లకు ఏపీఎన్జీవోల నుంచి సంపూర్ణ మద్దతు
సంపూర్ణ మద్దతు

APNGOs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన, హక్కుల పరిరక్షణ కోసం జేఏసీ చేపట్టబోయే ఉద్యమాలకు, భవిష్యత్తు కార్యక్రమాలకు ఏపీఎన్జీవో అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఐకాస ఛైర్మన్ ఎ. విద్యాసాగర్ తెలిపారు.
ఆదివారం విజయవాడలోని ఎన్జీవో భవన్‌లో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ వలిశెట్టి దామోదరరావు, కో-కన్వీనర్లు పి.వి. రమణారెడ్డి, సి.హెచ్. సుందరయ్య, వై. శ్రీనివాసరావు తదితర నాయకులు విద్యాసాగర్‌ను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి. రమణను కలిశారు. తమ మూడో దశ ఉద్యమానికి మద్దతు కోరారు.
విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టడాన్ని ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే ఆ బస్సులన్నింటినీ ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని, ఖాళీ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని, ప్రైవేటీకరణ జరగదన్న భరోసా ఉద్యోగులకు కల్పించాలని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని సూచించారు.
అదే సమయంలో విజయవాడలోని సీపీఐ కార్యాలయం దాసరి భవన్‌లో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి. వలరాజు, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం. యుగంధర్‌లను కలిసి ఆర్టీసీ ఉద్యమానికి మద్దతు తెలపాలని జేఏసీ నేతలు కోరారు. ఈ నెల 17, 18 తేదీల్లో రాష్ట్రంలోని 129 డిపోల్లో రెండు రోజుల సామూహిక నిరాహార దీక్షలు, 29న అన్ని జిల్లాల ప్రజా రవాణా అధికారుల కార్యాలయాల దగ్గర మహాధర్నాలు నిర్వహించనున్నారు. విద్యార్థి, యువజన సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు ఇస్తామని వలరాజు, యుగంధర్ తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో ఎస్.వి. శేషగిరిరావు, ఎం.డి. ప్రసాద్, ఆర్. సుబ్బారావు, ఎస్. రాజేశ్‌కుమార్, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

