పారిశ్రామికవేత్తలకు రియల్‌టైం అనుమతులు.. ఏపీకి బ్రాండ్‌ ఇమేజ్‌ తెచ్చాం

CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు అనుమతుల నుంచి పరిశ్రమల స్థాపన వరకు ప్రతి దశనూ రియల్‌టైంలో పర్యవేక్షిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. 'స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌' విధానంలో పెట్టుబడి ప్రతిపాదనలకు త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామని, ఎస్క్రో ఖాతా ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వెల్లడించారు.

దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సులో మూడో రోజు జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఏపీలో అమలవుతున్న విధానాలు, వేగవంతమైన నిర్ణయాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తోందని చెప్పారు. "రాష్ట్రానికి బ్రాండ్‌ ఇమేజ్‌ తెచ్చుకుంటే పెట్టుబడులు వస్తాయి. అవి అభివృద్ధికి దారితీస్తాయి. అభివృద్ధి జరిగితే పేదలకు సంక్షేమం అందుతుంది. ఈ బ్రాండ్‌ ఇమేజ్‌ కోసమే దావోస్‌ వేదికను ఉపయోగించుకుంటున్నాను. పెట్టుబడుల ఆకర్షణతో పాటు వినూత్న పరిణామాలను గమనించడానికి ఇది అద్భుత అవకాశం. గతంలో డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ అనేది నమ్మలేనిదిగా ఉండేది.. ఇప్పుడు అది నిజమైంది" అని వివరించారు.

భారీ లక్ష్యాలు.. నిరంతర కృషి

విశాఖపట్నంలో గూగుల్‌ డేటాసెంటర్‌ రావడం రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యమైన అడుగని, ఐటీ మంత్రి నారా లోకేష్‌ చొరవ, నిరంతర పర్యవేక్షణతోనే అది సాధ్యమైందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గూగుల్‌తో చర్చలు మొదలుపెట్టామన్నారు. గ్రీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా.. ఏపీలో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభమైందని, విదేశాలకు ఎగుమతి ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. "భారీ లక్ష్యాలు నిర్దేశించుకోవడం, వాటి సాధనకు నిరంతరం కృషి చేయడం నాకు అలవాటు. వినూత్న ఆలోచనలు, ముందుచూపుతో కష్టపడితే ఏదైనా సాధ్యమని యువతకు చెబుతుంటాను" అని పేర్కొన్నారు.

అమరావతి.. ప్రపంచ స్థాయి నగరం

అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఒక గొప్ప అవకాశంగా చూస్తున్నామని, ప్రపంచ ప్రమాణాలతో, అద్భుత ప్రణాళికతో నిర్మిస్తున్నామని వివరించారు. "అమరావతిని భవిష్యత్‌ నగరంగా, గ్రీన్‌ & బ్లూ సిటీగా తీర్చిదిద్దుతున్నాం. పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నాం. రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పారిశ్రామిక రంగం గురించి చర్చ జరుగుతోంది. సింగపూర్‌ మాజీ ప్రధాని లీ క్వాన్‌ యూ, మలేషియా మాజీ ప్రధాని మహాతీర్‌ మోహమద్‌ నాకు స్ఫూర్తి" అని తెలిపారు.

యువ శక్తే మా బలం

చైనా, జపాన్‌ వంటి దేశాల్లో వృద్ధాప్యం పెరుగుతుండగా.. భారత్‌లో యువ జనాభా ఎక్కువగా ఉందని, సమర్థ మానవ వనరులు, సాంకేతికత దేశ బలమని చంద్రబాబు చెప్పారు. "ఒకప్పుడు ఎలక్ట్రానిక్‌ వస్తువులు దిగుమతి చేసుకునేది భారత్‌.. ఇప్పుడు ఆ రంగంలో ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుంది" అని గుర్తుచేశారు.

ఈ విధంగా సీఎం చంద్రబాబునాయుడు దావోస్‌లో ఏపీ అభివృద్ధి వ్యూహాలను, పారిశ్రామిక ఆకర్షణ చర్యలను జాతీయ మీడియాకు వివరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story