సీజేఐపై దాడి యత్నం ఖండనీయం- వెంకయ్యనాయుడు
దాడి యత్నం ఖండనీయం- వెంకయ్యనాయుడు

ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు సమయ పరిమితి అవసరం: వెంకయ్యనాయుడు
Venkaiah Naidu: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి యత్నం న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. మంగళవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటాచలంలో విలేకరులతో మాట్లాడుతూ, సీజేఐపై చెప్పు విసిరిన ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అదే విధంగా, ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు నిర్దిష్ట సమయ పరిమితి ఉండాలని వెంకయ్యనాయుడు సూచించారు. కేసులు నమోదైన రెండేళ్లలోపు తీర్పు ఇవ్వాలని, ఇతర కేసుల కంటే వీటికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. తీర్పులలో జాప్యం, పదేపదే వాయిదాలు జరగడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై స్పందన విషయంలో పార్టీలు తమకు సంబంధించినప్పుడే గట్టిగా మాట్లాడతాయని, ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు అవసరమని ఆయన తెలిపారు.
ఉచిత పథకాలు అమలు చేయడం సముచితం కాదని, అవి అభివృద్ధికి అడ్డంకిగా మారతాయని వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పథకాల కోసం ప్రభుత్వాలు తీసుకునే అప్పులను ఎలా తీర్చాలనే దానిపై ప్రజల ముందు అఫిడవిట్ దాఖలు చేసి, అసెంబ్లీలో ఆమోదం పొందాలని సూచించారు. కొంతమంది ప్రజాప్రతినిధులు రాజకీయాలతో సంబంధం లేని కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా దూషించడం అనైతికమని, పార్టీలు తమ సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.
