ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసిన దుండగులు

  • దాడిపై ఉలిక్కిపడ్డ నెల్లూరు నగరం
  • నల్లపురెడ్డి ఇంటిని సందర్శించిన మాజీ మంత్రి అనిల్, ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి
  • ప్రసన్నకుమార్‌ రెడ్డిని ఫోన్‌ లో పరామర్శించిన వైఎస్‌.జగన్‌

మాజీమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి నివాసంపై 80 మంది దుండగులు ఒకే సారి దాడి చేసి ఇంటిని మొత్తం ధ్వంసం చేశారు. నెల్లూరు నగరంలోని సావిత్రి నగర్‌ లో ఉన్న ప్రసన్న కుమార్‌ రెడ్డి నివాసంపై సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అనుచరులు సుమారు 80 మంది దాడి చేసి ఇంటిలో ఉన్న ఫర్నిచర్‌ తో పాటు రెండు కార్లను పూర్తిగా ధ్వంసం చేశారు. దాడి జరిగిన సమయంలో ప్రసన్నకుమార్‌ రెడ్డి నివాసంలో కింటి ఆపరేషన్‌ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆయన తల్లి ఒక్కరే ఉన్నారు. దాడికి పాల్పడటానికి ముందు ప్రశన్నకుమార్‌ రెడ్డి ఇంటి ఆవరణలోకి చొరబడ్డ దుండగులు తమను ఎవరూ గుర్తుపట్టకుండా ముందుగా సీసీటీవీలను ధ్వంసం చేశారు. అనంతరం ప్రసన్న కమార్‌ రెడ్డి ఇంటి కింద భాగం, పై భాగంలో ఉన్న గృహోపకరణాలు మొత్తాన్ని బద్దలు కొట్టేశారు. అడ్డువచ్చిన సిబ్బందిన దుండగులు దాడికి పాల్పడ్డారు. దాదాపు అరగంట పాటు ప్రసన్నకుమార్‌ రెడ్డి ఇంటిలో విధ్వంసం సృష్టించిన దుండగులు వేమిరెడ్డితో పెట్టుకుంటే అంతుచూస్తామని బెదిరించి వెళ్లారు. అత్యంత కిరాతకంగా జరిగిన ఈ దాడిని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు అందరూ ఖండించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ చంద్రశేఖరెడ్డిలు ప్రసన్నకుమార్‌ రెడ్డి ఇంటికి వెళ్ళి వేమిరెడ్డి అనుచరులు చేసిన విధ్వంస కాండను పరిశీలించారు. దాడి సంఘటన తెలిసిన వెంటనే నెల్లూరు డిఎస్పీ పి.సింధుప్రియ హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. అయితే దాడి జరిగిన సమయంలో మంత్రి నారా లోకేష్‌ నెల్లూరు నగరంలోనే ఉన్నారు. దాడి విషయం తెలిసిన వైఎస్‌ఆర్సీపీ అధినేత వైఎస్‌.జగన్‌ మాజీ మంత్రి ప్రసన్న కుమార్‌ రెడ్డికి ఫోన్‌ చేసి పరామర్శించారు. దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తన ఇంటిపై జరిగిన దాడి విషయంపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ తనను హత్య చేయడానికే ఈ దాడి చేశారని ఆరోపించారు. దాడి జరిగిన సమయంలో తాను ఇంటిలో ఉండి ఉంటే ఖచ్చితంగా తనను హతమార్చి ఉండేవారని ప్రసన్నకుమార్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తన తల్లిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలుసహజమని వేమిరెడ్డి దంపతులు ఇటువంటి దుర్మార్గమైన రాజకీయాలకు పాల్పడతారని అనుకోలేదని అన్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చరిత్ర నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే అని, నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని స్పష్టం చేశారు. గతంలో ఇటువంటి దాడులు నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ జరగలేదని, రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తందని నల్లపురెడ్డి విమర్శించారు. నా ఇంటిపై జరిగిన దాడి విషయంలో పోలీసులు న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు లేదని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇటువంటి దాడులపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ స్పందించాలని డిప్యూటీ సీయం అయిపోయి కుర్చీలో కుర్చున్నాం అనుకుంటే సరిపోదని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story