తెలంగాణ, రాజస్తాన్‌, త్రిపురలకు కూడా కొత్త సీజేలు

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా తిరిగి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం మద్రాస్‌ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కొన్ని రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. సుప్రీం కొలీజియం తీసుకున్న ఈ నిర్ణయానికి మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గతంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2023లో ఆయన్ను ఏపీ నుంచి మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ చేశారు. తాజాగా జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ను తిరిగి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కూడా ప్రధాన న్యాయమూర్తులను నియమించారు. తెలంగాణ హైకోర్టు సీజేగా అపరేష్‌ కుమార్‌ సింగ్‌, త్రిపుర హైకోర్టు సీజేగా ఎంఎస్‌.రామచంద్రరావు, రాజస్ధాన్‌ హైకోర్టు సీజేగా కేఆర్‌.శ్రీరామ్‌ లు నియమితులయ్యారు.

జస్టిస్ బట్టు దేవానంద్ 1966లో కృష్ణా జిల్లా, గుడివాడ లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. విద్యాభ్యాసం అంతా గుడివాడలోనే జరిగింది. విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా నుండి న్యాయవాద విద్య పూర్తి చేశారు. 1996 నుండి 2000 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా, 2014 నుండి 2019 వరకు గవర్నమెంట్ ప్లీడర్‌గా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు స్టాండింగ్ కౌన్సెల్‌గా ప్రో బోనో కేసులను వాదించారు. జనవరి 13, 2020న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2023లో సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు మేరకు మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆ సమయంలో ఆయన బదిలీ రద్దు చేయాలని న్యాయవాదులు ధర్నాలు చేశారు.

Updated On 15 July 2025 2:05 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story