CM Chandrababu’s Key Message: ముఖ్యమంత్రి చంద్రబాబు: ప్రతిరోజూ పరీక్షలా సిద్ధంగా ఉండాలి
ప్రతిరోజూ పరీక్షలా సిద్ధంగా ఉండాలి

CM Chandrababu’s Key Message: మంత్రులు, శాసనసభ్యులు ప్రతిరోజూ పరీక్ష రాస్తున్నట్లు స్పృహతో పూర్తి సన్నద్ధతతో అసెంబ్లీకి హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏదైనా అంశాన్ని సభలో ఒక్కసారి సమర్థవంతంగా ప్రజెంట్ చేస్తే అది ఏడాది పాటు ఇంటింటా చర్చనీయాంశమవుతుందని ఆయన వివరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సభలో విషయాలను ఎంత ప్రభావవంతంగా ప్రస్తావిస్తున్నారో, వారి ప్రజెంటేషన్ ఎలా ఉందో ఏఐ (కృత్రిమ మేధస్సు) ద్వారా విశ్లేషిస్తున్నామని తెలిపారు.
బడ్జెట్ సమావేశాల్లో మంత్రులు పూర్తి సన్నద్ధతతో వచ్చి సమాధానాలివ్వాలని సూచించారు. ప్రతిపక్షం సభలో నిర్మాణాత్మక పాత్ర పోషించకుండా బయట బాధ్యత లేని రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రోజూ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఒక అంశంపై లఘు చర్చ చేపట్టాలని సీఎం ప్రతిపాదించారు. సంబంధిత శాఖ మంత్రి చర్చను లీడ్ చేస్తారని, కూటమి పార్టీల సభ్యులంతా భాగస్వాములై అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అవసరమైతే తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్చలో పాల్గొంటామని మంత్రులకు తెలిపారు.
శ్రీకాకుళం, రాజమహేంద్రవరం ఘటనలపై కఠిన చర్యలు
శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి, రాజమహేంద్రవరంలో కల్తీ పాల విక్రయం ఘటనలను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని సీఎం పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శాఖలవారీగా జరుగుతున్న అభివృద్ధి, కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేలా మంత్రులు పనిచేయాలని, కార్యదర్శులతో సమన్వయం చేసుకుని దస్త్రాలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.
పింఛన్ల పంపిణీలో నిబద్ధత
ఈ నెలలో ఒకటో తేదీ ఆదివారం రావడంతో ముందురోజు శనివారమే (ఫిబ్రవరి 28) పింఛన్లు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. పింఛన్లు ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా అందజేస్తున్నామని, అదే మన నిబద్ధత అని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీలో తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టం చేశారు. దీంతో ఫిబ్రవరి 28న శాసనసభకు సెలవు ఇవ్వాలనే అంశం చర్చకు వచ్చింది. ఆ రోజు సభ కార్యకలాపాలు రద్దు చేయాలని తీర్మానించారు.
తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడిన వైకాపా హయాంలో జరిగిన అపచారంపై మంగళవారం సభలో సీఎం భావోద్వేగంగా మాట్లాడారని కొందరు మంత్రులు ప్రస్తావించారు. గురువారం శాసనమండలిలోనూ ఈ అంశంపై ప్రభావవంతంగా ప్రజెంటేషన్ ఇవ్వాలని సీఎం సూచించారు.
మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు
రిలయన్స్ కన్స్యూమర్స్ లిమిటెడ్, సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్, రేమండ్ గ్రూప్ ప్రెసిషన్ టెక్నాలజీ లిమిటెడ్, జేకే మైని గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్ వంటి సంస్థలకు కేటాయించిన భూములకు సంబంధించి డబ్బు చెల్లింపు, ప్రాజెక్టుల గడువు పెంపుకు ఆమోదం.
పల్నాడు జిల్లా కొండవీడు వద్ద 12.31 ఎకరాల్లో ప్రైవేట్ ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు అర్షధాతు గ్రీన్ నానోటెక్నాలజీస్‌కు అనుమతి.
రాధికా వెజిటబుల్ ఆయిల్స్ లిమిటెడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్, హెరిటేజ్ ఫుడ్స్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ అప్‌గ్రేడేషన్/విస్తరణ, ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, స్నేహా ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తర్వుల సవరణలు, ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీ పొడిగింపుకు ఆమోదం.
హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్, అజాద్ ఇండియా మొబిలిటీ, జిన్‌ఫ్రా ప్రెసిషన్స్, జూపిటర్ రెన్యువబుల్ సంస్థలకు గతంలో చేసిన భూ కేటాయింపులు రద్దు.
రామాయపట్నం రైలు కార్గో టెర్మినల్‌కు 153.77 ఎకరాలు
ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు నుంచి నేరుగా 153.77 ఎకరాల భూమిని రామాయపట్నం కార్గో రైల్ టెర్మినల్ (ఆర్‌సీఆర్‌టీ)కు బదిలీ చేసేందుకు అనుమతి తెలిపారు.

