CM Chandrababu: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం.. ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు నాంది: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

ఆడబిడ్డల థింసా నృత్యం రాష్ట్రానికే గర్వకారణం
CM Chandrababu: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు నాంది పలికిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం ఏర్పాటైన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆడబిడ్డలు ప్రదర్శించిన థింసా నృత్యం రాష్ట్రానికే గర్వకారణమని సీఎం చంద్రబాబు అన్నారు. 13 వేల మందికి పైగా నృత్యం చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారని చెప్పారు. ఈ ప్రదర్శన మన సంప్రదాయాలు, భవిష్యత్ ఆకాంక్షలను చాటి చెప్పిందన్నారు. అద్భుత ప్రదర్శన చేసిన మహిళలు, చిన్నారులకు, వారి గురువులకు ధన్యవాదాలు తెలిపారు. మన వారసత్వం అభివృద్ధి పథంలో వెళ్లడమే నిజమైన ‘వికాస్ భీ – విరాసత్ భీ’ స్ఫూర్తి అని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు కూడా చేశారు.
సభలో మాట్లాడుతూ సీఎం ఇలా అన్నారు: ‘‘ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్‌పోర్టు. భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నా. ఉత్తరాంధ్ర వాసి జీఎమ్మారే ఈ ఎయిర్‌పోర్టు నిర్మించారు. తొలి అడుగు వేసిన అశోక్ గజపతి రాజు, నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడు ఇక్కడి వారే. భోగాపురం ఎయిర్‌పోర్టుకు నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే.. నేడు గుమ్మడికాయ కొట్టింది మనమే.
ఈ విమానాశ్రయంతో ఈ ప్రాంతం దశ, దిశ మారతాయి. ఉత్తరాంధ్రకు గూగుల్, స్టీల్ కంపెనీతో పాటు చాలా సంస్థలు వచ్చాయి. రెండేళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని చూశాం. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చిన వ్యక్తి మోదీ. పోలవరం, రైల్వే జోన్, విశాఖ ఉక్కును కాపాడిన వ్యక్తి మోదీ. ప్రధాని సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు పెట్టుబడులు రాబోతున్నాయి. రూ.2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. రాజధాని అమరావతికి నిధులు ఇచ్చి అండగా నిలబడ్డారు. 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తాం.
ప్రధాని మోదీ 12 ఏళ్లుగా దేశాన్ని సమర్థంగా నడిపిస్తున్నారు. ఈ దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. పరిపాలనలో అవినీతి ఆరోపణలు లేకుండా ముందుకెళ్తున్నారు. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు నిర్మిస్తున్నారు. సౌరశక్తి, గ్రీన్ హైడ్రోజన్ ద్వారా కాలుష్యం తగ్గిస్తున్నారు. దేశంలో తీవ్రవాదం, నక్సలిజం లేకుండా అరికట్టారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉంటోంది. ఇలాంటి నేతలను నా రాజకీయ జీవితంలో చూడలేదు. ప్రతి విషయంలో నేషన్ ఫస్ట్ అనే ప్రధానిని తొలిసారి చూస్తున్నా. భారత్ 2047లోగా ప్రపంచంలోనే నంబర్ వన్‌గా మారుతుంది’’ అని సీఎం అన్నారు.

