Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధం.. రూ.17,900 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన
మోదీ శంకుస్థాపన

Bhogapuram Airport: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (ఆగస్టు 1) దీన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘‘రేపు భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నాం. ఇది దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మరో కీలక మైలురాయి’’ అని పేర్కొన్నారు.
ప్రధాని పోస్ట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు షేర్ చేస్తూ ‘‘ఉత్తరాంధ్ర టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. మోదీజీ.. మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం’’ అని స్పందించారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపిరి లభిస్తుందని, పెట్టుబడులు, పర్యాటకం, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించనున్నాయని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
పీఎంవో విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ప్రధాని ఆగస్టు 1న ఏపీ, కర్ణాటకలో పర్యటిస్తారని తెలిపింది. విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.17,900 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని పేర్కొంది.
రూ.5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభం కాబోతోంది. రూ.460 కోట్లతో విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన జరుగుతుంది. ఈ ప్లాంట్‌లో ఏడాదికి సుమారు 9.6 కోట్ల సెమీకండక్టర్ చిప్‌లు తయారవుతాయి.
రూ.5,550 కోట్లతో ఏర్పాటుచేస్తున్న కర్నూలు-IV పునరుత్పాదక ఇంధన జోన్ విద్యుత్ ప్రసార వ్యవస్థ ప్రాజెక్టుకు శంకుస్థాపన, కర్నూలు, అనంతపురం సోలార్-విండ్ ఎనర్జీ జోన్లకు సంబంధించిన రూ.3,550 కోట్లు, రూ.820 కోట్ల ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టుల ప్రారంభం కూడా జరుగుతాయి. రూ.1,880 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన జరుగనున్నాయి. ఈ రహదారి ప్రాజెక్టులతో విజయవాడలో ట్రాఫిక్ రద్దీ తగ్గడం, విశాఖ-హైదరాబాద్ ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రాంతీయ అనుసంధానం మెరుగుపడనుంది.
అనంతరం మైసూరులో స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించి సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

