Bhoomi Pooja for Expansion of Venkateswara Swamy Temple in Amaravati: చంద్రబాబు నేతృత్వంలో అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు భూమిపూజ
వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు భూమిపూజ

Bhoomi Pooja for Expansion of Venkateswara Swamy Temple in Amaravati: దేవతల రాజధాని ఎలా ఉంటుందో.. అదే నమూనాతో ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాల భూములను స్వచ్ఛందంగా ఇచ్చినట్టు అభినందించారు. అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు గురువారం సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. రూ.260 కోట్లతో రెండు దశల్లో ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
అమరావతి రాజధాని అభివృద్ధిలో ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా వెంకటపాలెంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, “రాజధాని అమరావతిని దేవతల నగరంగా మలిచేందుకు ఈ ఆలయం కీలకం. రైతుల సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమం సాధ్యమయింది” అని పేర్కొన్నారు. ఆలయ ప్రాకారం, మహారాజగోపురం, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయాల నిర్మాణం, మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్ వంటి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.
మొదటి దశలో రూ.140 కోట్ల బడ్జెట్‌తో పనులు ప్రారంభిస్తున్నారు. ఇందులో రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ గట్టి ప్రాకారాన్ని నిర్మిస్తారు. మరో రూ.48 కోట్లతో ఏడు అంతస్తుల మహారాజగోపురం, ఆర్జిత సేవా మండపం, వాహన మండపం, రథ మండపం, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ వంటి నిర్మాణాలు పూర్తి చేస్తారు. రెండో దశలో రూ.120 కోట్లతో శ్రీవారి ఆలయ మాడవీధులు, అప్రోచ్ రోడ్, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికుల విశ్రాంతి భవనాలు, అర్చకులు, సిబ్బంది క్వార్టర్లు, రెస్ట్ హౌస్, పరిపాలన భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తారు.
2014-19 తెలుగుదేశం ప్రభుత్వం శ్రీవారి ఆలయాన్ని రూ.185 కోట్లతో అభివృద్ధి చేసే ప్రణాళిక సిద్ధం చేసింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీఎస్ఆర్ సర్కార్ దానిని రూ.36 కోట్లకు మాత్రమే పరిమితం చేసింది. తాజాగా అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ-కూటమి ప్రభుత్వం, 2014-19 నాటి ప్రణాళికను మించిన విధంగా పూర్తి హై-టెక్ సౌకర్యాలతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ పనులతో అమరావతి ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని అధికారులు తెలిపారు.

