Parchuri Ashok Babu Fires: జగన్ రాజకీయ జీవితానికి గండి.. కోర్టు హాజరుతో స్థాయి బయటపడింది: పర్చూరి అశోక్ బాబు ఫైర్!
కోర్టు హాజరుతో స్థాయి బయటపడింది: పర్చూరి అశోక్ బాబు ఫైర్!

Parchuri Ashok Babu Fires: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం చరమాంక దశలో ఉందని, కోర్టు హాజరు కోసం చేసిన ఆర్భాటం ఆయనలోని భయాన్ని, ఉన్మాదాన్ని బయటపెట్టిందని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. 11 సీబీఐ, 9 ఈడీ కేసులు ఎదుర్కొంటున్న జగన్.. చార్టర్డ్ విమానంలో వచ్చి వేలాది మందితో బలప్రదర్శన చేస్తూ కోర్టుకు హాజరు కావడం ‘చావుకూ పెళ్లికీ ఒక్కటే భజంత్రీ’ అన్న సామెతకు అక్షరాలా సరిపోతుందని ఎద్దేవా చేశారు.
గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, పీవీ నరసింహారావు వంటి సీనియర్ నేతలు సాదాసీదాగా కోర్టుకు వెళ్లారని, కానీ సీఎం అయిన తర్వాత జగన్ పంథా మార్చేశారని గుర్తు చేశారు. ఒకప్పుడు ఖర్చులు అడ్డుపెట్టి వాయిదాలు అడిగిన జగన్.. ఇప్పుడు ఇంతటి హడావిడి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. అసెంబ్లీకి కూడా రాని వ్యక్తి కోర్టుకు వెళ్తుంటే ఇంత ఆర్భాటం అవసరమా? అని సామాన్య ప్రజలే ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు.
2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లతో వైఎస్ఆర్సీపీని ప్రజలు ఇంటికి సాగనంపడం ద్వారా జగన్ స్థాయి స్పష్టమైందని, ఏ ఒక్క కేసులోనైనా శిక్ష పడితే రాజకీయ భవిష్యత్తు అంతమవుతుందని, 2029లో కడపలో కూడా గెలవడం కష్టమని అశోక్ బాబు హెచ్చరించారు. భూములు, ఇసుక, మద్యం కుంభకోణాల్లో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, అన్ని ఆధారాలు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపుతున్నాయని మండిపడ్డారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో మొదట చంద్రబాబుపై నెపం నెట్టిన జగన్.. ఇప్పుడు సీబీఐ సాక్ష్యాలు ఆయనతోపాటు ఆయన భార్య భారతి వైపు చూపుతున్నాయని వెల్లడించారు. తల్లిని, చెల్లెల్ని సరిగ్గా చూడని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం చూస్తాడని ప్రశ్నించారు. ఈ బలప్రదర్శనలకు తెలుగుదేశం భయపడదని, నష్టపోయేది జగన్‌తోపాటు ఆయన అనుచరులే అని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక పునరుద్ధరణపై దృష్టి పెట్టిందని చెప్పిన అశోక్ బాబు.. వైఎస్ఆర్సీపీ శ్రేణులు వాస్తవాలను గమనించి, జగన్‌తో కొనసాగాలా? లేదా? అని ఆలోచించుకోవాలని సూచించారు.

