Big Setback for YSRCP in Undi Constituency: ఉండి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కి తీవ్రమైన షాక్ తగిలింది. ఉండి నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేస్తున్న పీవీఎల్ నరసింహరాజు పార్టీకి రాజీనామా చేశారు.

వైసీపీ అధిష్టానం నరసింహరాజును తొలగించి, ఆయన స్థానంలో మంతెన యోగేంద్ర కుమార్ (బాబు)ను నియోజకవర్గ ఇంచార్జిగా నియమించిన నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నరసింహరాజు ఈ నిర్ణయం తీసుకున్నారు.

పీవీఎల్ నరసింహరాజు ఉండి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో డీసీసీబీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 2017లో జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పిలిచి నియోజకవర్గ ఇంచార్జిగా అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, తాను నిజాయితీగా పని చేశానని నరసింహరాజు తెలిపారు.

రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని జగన్‌ను కలిసినప్పుడు యోగేంద్ర కుమార్‌కు ఇంచార్జి ఇస్తే సహకరించలేమని చెప్పానని, అయినప్పటికీ అధిష్టానం తన మాట వినకుండా ఆయనకు బాధ్యతలు అప్పగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ఆయన ఎన్నడూ జండా పట్టలేదు, పార్టీకి పని చేయలేదు. అయినా ఆయనకు ఇంచార్జి ఇచ్చారు. పార్టీలో గౌరవం లేనప్పుడు ఉండి ఏం లాభం?” అని ప్రశ్నించారు.

జిల్లాలో ఇద్దరు నాయకులు డమ్మీలను పెట్టి పార్టీని బ్రష్టుపట్టిస్తున్నారని, వారి వల్ల వైసీపీ జిల్లాలో నాశనమైందని నరసింహరాజు ఆరోపించారు. పార్టీ నుంచి బయటకు వెళ్తున్న గ్రంధి శ్రీనివాస్, కొట్టి సత్యనారాయణలతో కూడా అధ్యక్షుడు మాట్లాడలేదని విమర్శించారు. తనను నమ్మిన సహచరుల కోసం కొత్త పార్టీ అండ కావాలని, వారంలోపు తన భవిష్యత్ కార్యాచరణను తెలియజేస్తానని స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story