BJP: పోలవరం ప్రాజెక్ట్‌ను వైకాపా అపహాస్యం చేసింది: భాజపా తీవ్ర విమర్శ
భాజపా తీవ్ర విమర్శ
BJP: రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును వైకాపా ప్రభుత్వం హాస్యాస్పద అంశంగా చూసి, అపహాస్యం చేసిందని భారతీయ జనతా పార్టీ (భాజపా) రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. అప్పటి జలవనరుల శాఖ మంత్రులు అనిల్ యాదవ్, అంబటి రాంబాబు ఈ ప్రాజెక్టును హేళన చేశారని ఆరోపించారు.
గురువారం ఉదయం రాజమహేంద్రవరంలోని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నివాసం నుంచి భాజపా ప్రతినిధి బృందం బస్సులో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లింది. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పార్థసారథి, ఈశ్వరరావు తదితరులతో కలిసి మాధవ్ మీడియాతో మాట్లాడారు.
ప్రాజెక్టు పురోగతి అద్భుతం:
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనులు 80 శాతానికి పైగా పూర్తయ్యాయని భాజపా నాయకులు వెల్లడించారు. కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణా బేసిన్‌కు, ఎడమ కాలువ ద్వారా మరో పది రోజుల్లో అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో సాధించిన అద్భుతాల్లో పోలవరం ఒకటని వారు అభివర్ణించారు.
జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించింది:
మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, 2019-24 మధ్య కాలంలో కేంద్రం రూ.8,700 కోట్లు మంజూరు చేసినా జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో భాజపా నాయకులు వెంకయ్యనాయుడు, ఆడ్వాణీ, సుష్మా స్వరాజ్ తదితరులు ఒత్తిడి తెచ్చి జాతీయ ప్రాజెక్టుగా చేయడంతో విభజన చట్టంలో చేర్చారని గుర్తు చేశారు. 2014కి ముందు రూ.580 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టుకు ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటివరకు రూ.20,700 కోట్లు విడుదల చేసిందని తెలిపారు.
జాతీయ నాయకత్వానికి నివేదిక:
పార్లమెంటు సమావేశాల ముందే పోలవరం ప్రాజెక్టుపై ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలని భాజపా జాతీయ నాయకత్వానికి వినతిపత్రం అందించనున్నట్లు కేంద్ర సహాయమంత్రి శ్రీనివాసవర్మ, మాధవ్ తెలిపారు. పునరావాసం, గండిపోశమ్మ ఆలయ సంరక్షణ వంటి అంశాలపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని భరోసా వ్యక్తం చేశారు.
ఈ సందర్శన యాత్రలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. భాజపా నాయకులు పార్టీ జెండాలు చేతపట్టుకొని పోలవరం ప్రాజెక్టు వద్ద నడిచి, ప్రాజెక్టు పురోగతిని పరిశీలించారు.



