CM Chandrababu: బ్రిక్స్ సదస్సు-18 విజయం.. ప్రపంచ వేదికపై భారత్ సత్తా చాటింది: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

CM Chandrababu: న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడం గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ప్రపంచం కీలక మార్పులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
బ్రిక్స్ సదస్సు ద్వారా న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించడం, బహుళపక్ష సంస్థలను బలోపేతం చేయడం, సరఫరా వ్యవస్థలను పటిష్టం చేయడం, ఆవిష్కరణలు, సుస్థిరాభివృద్ధి, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని సీఎం స్వాగతించారు. రాబోయే దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే కీలక అంశాలుగా వీటిని అభివర్ణించారు.
విభిన్న అభిప్రాయాలు కలిగిన దేశాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి నిర్మాణాత్మక చర్చల ద్వారా ఏకాభిప్రాయం సాధించే విశ్వసనీయ వేదికగా భారత్ ఎదిగిందని చంద్రబాబు కొనియాడారు. అంతర్జాతీయ వేదికపై బ్రిక్స్ దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం పెరుగుతున్న భారత్ ఆర్థిక శక్తి, ప్రాధాన్యానికి నిదర్శనమని అన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ‘‘ఈ చరిత్రాత్మక సదస్సును విజయవంతంగా నిర్వహించిన ప్రధాని మోదీకి నా అభినందనలు’’ అని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారత్ గొంతు గతంలో ఎన్నడూ లేనంతగా విశ్వాసం, గౌరవంతో వినిపిస్తోందని, బ్రిక్స్ సదస్సు విజయం ద్వారా అంతర్జాతీయంగా భారత్ స్థాయి మరింత పెరిగిందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ కూడా చేశారు.

