Cabinet Gives Green Signal: కీలక ప్రాజెక్టులకు మంత్రిమండలి సై
మంత్రిమండలి సై

Cabinet Gives Green Signal: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.30,353 కోట్ల పెట్టుబడులతో 34,610 మందికి ఉపాధి కల్పించే వివిధ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. డేటా సెంటర్లు, సోలార్ ప్రాజెక్టులు, ఎనర్జీ రంగం, రక్షణ సంబంధిత యూనిట్లు, ఆయుష్ ఉత్పత్తులు వంటి రంగాల్లో పెట్టుబడులు ఊపందుకున్నాయి.
అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీలో సి-డాట్, ఆటోమియామిక్స్ ఇండియా, క్యూపీఐ ఏఐ ఇండియా, ఫ్రూగల్ ఏఐ హబ్ సహా 11 సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. రూ.50 లక్షల నుంచి రూ.100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే ఈ సంస్థలు రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్‌గా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తాయని అంచనా.
రక్షణ రంగంలో కీలక ప్రాజెక్టులు:
నెల్లూరు జిల్లా దత్తలూరు మండలంలో అనంత్ టెక్నాలజీస్‌కు 300 ఎకరాల్లో మిస్సైల్, లాయిటరింగ్ మునిషన్ ఉత్పత్తి, అసెంబ్లీ, టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు.
అనంతపురం జిల్లా తిమ్మసముద్రంలో స్పేస్ ఫీల్డ్స్‌కు 120.76 ఎకరాల్లో సాలిడ్ ప్రొపెల్లెంట్ ప్రాసెసింగ్ కేంద్రం.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఐకామ్ టెలి లిమిటెడ్‌కు 300 ఎకరాల్లో రక్షణ పేలుడు పదార్థాల తయారీ కేంద్రం.
ప్రోటెరియల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నియోడైమియం-ఐరన్-బోరాన్ అయస్కాంతాల తయారీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు. ఈ ప్రాజెక్టుకు రూ.2,250 కోట్ల పెట్టుబడితో 530 మందికి ఉపాధి.
ఇతర ముఖ్య నిర్ణయాలు:
ప్రైవేటు బస్సుల పన్ను తగ్గింపు: ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్‌ల ద్వారా నడిచే బస్సుల త్రైమాసిక పన్నును ఒక్క సీటుకు రూ.4,000 నుంచి రూ.2,500కు తగ్గించారు.
విమానాశ్రయాల అభివృద్ధి: తిరుపతి మినహా ఇతర విమానాశ్రయాల్లో బార్లు, రిటైల్ దుకాణాల ఏర్పాటుకు ముసాయిదా విధానాలకు ఆమోదం.
విద్యా రంగం: 2026-27 నుంచి 10 కొత్త బీసీ గురుకులాలు ఏర్పాటు. తక్కువ విద్యార్థులున్న 54 బీసీ వసతి గృహాలు రద్దు. డీమ్డ్ యూనివర్సిటీల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ విస్తరణ.
పతంజలి ప్రాజెక్టు: విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో రూ.370 కోట్లతో ఫుడ్ & హెర్బల్ పార్క్ ఏర్పాటుకు 70 ఎకరాలు కేటాయింపు. రెండు వేల మందికి ఉపాధి.
కాలువల ఆధునికీకరణ: శ్రీశైలం ప్రాజెక్టు సంబంధిత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బనకచర్ల వరకు కాలువల ఆధునికీకరణకు అనుబంధ ఒప్పందాలు, అంచనాల సవరణకు ఆమోదం.
ఈ నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేస్తాయని, యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతాయని మంత్రిమండలి వర్గాలు తెలిపాయి. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని అధికారులు వ్యాఖ్యానించారు.

