CBI : జగన్ కంపెనీల్లో పెట్టుబడులు ‘క్విడ్ ప్రోకో’లో భాగమే: హైకోర్టులో సీబీఐ వాదన
హైకోర్టులో సీబీఐ వాదన

CBI : వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డికి చెందిన కంపెనీల్లో దాల్మియా సిమెంట్స్‌తో సహా పలు సంస్థలు పెట్టుబడులు పెట్టాయని, ఇవన్నీ లాభాల కోసమే కాకుండా అప్పటి ప్రభుత్వం నుంచి అనుచిత లాభాలు పొందిన ‘ముడుపుల’ రూపంలో ఉన్నాయని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ పెట్టుబడులన్నీ ‘క్విడ్ ప్రోకో’ (Quid Pro Quo) పరిధిలో ఉన్నాయని, వాటి వాస్తవికతను ప్రస్తుత దశలో నిర్ణయించడం సరికాదని సీబీఐ తన వాదనలో పేర్కొంది. ఇదే విషయాన్ని హైకోర్టు సహా సుప్రీం కోర్టు కూడా గతంలో పలు సందర్భాల్లో స్పష్టం చేసినట్లు తెలిపింది.
జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ దాల్మియా సిమెంట్స్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ కె. సుజన సోమవారం విచారణ చేపట్టారు. సీబీఐ తరఫున ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపించారు.
అక్రమ లీజు బదిలీలు, ముడుపుల లావాదేవీలు..
సీబీఐ న్యాయవాది వివరించిన విషయాల ప్రకారం.. కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం, నవాబ్‌పేట గ్రామాల్లో 407.05 హెక్టార్ల లీజును అప్పటి ప్రభుత్వం అక్రమ పద్ధతుల్లో దాల్మియా సిమెంట్స్‌కు కట్టబెట్టింది. దీనికి ప్రతిఫలంగా దాల్మియా సంస్థ జగన్ సంబంధిత కంపెనీల్లో రూ.95 కోట్ల పెట్టుబడి పెట్టింది.
1997లో జయా మినరల్స్ సున్నపు రాయి నిక్షేపాల కోసం ప్రాస్పెక్టింగ్ లీజు కోసం దరఖాస్తు చేసింది. అయితే దరఖాస్తులో ఉన్న చిరునామాలో కంపెనీ లేదన్న కారణంగా దాన్ని తిరస్కరించారు. తర్వాత 2004లో జయా మినరల్స్‌ను సజ్జల దివాకర్‌రెడ్డికి చెందిన ఈశ్వర్ సిమెంట్స్ స్వాధీనం చేసుకుంది. ఈ ఒప్పందం కూడా పాత తేదీతో చేసినట్లు కనిపించింది. ఒప్పందం తేదీకి, స్టాంపు కొనుగోలు తేదీకి పొంతన లేదు.
ఆ తర్వాత జయా మినరల్స్ కోరిన లీజును తమకు బదిలీ చేయాలని ఈశ్వర్ సిమెంట్స్ దరఖాస్తు చేసింది. అధికారులు 407 హెక్టార్ల లీజు మంజూరు చేశారు. ఆ లీజును తర్వాత దాల్మియా సిమెంట్స్‌కు బదిలీ చేశారు. ఒకే వ్యవహారంపై భిన్న నిర్ణయాలు తీసుకోవడం కుట్రలో భాగమని సీబీఐ ఆరోపించింది.
ముడుపుల రూపంలో పెట్టిన వాటాలను విక్రయించడం ద్వారా వచ్చిన రూ.146 కోట్లు దాల్మియాకు అందలేదని, ఆ నిధులు జగన్‌కు చేరాయని కీలక ఆధారం పెన్‌డ్రైవ్‌లో ఉందని సీబీఐ తెలిపింది. ఈ పెన్‌డ్రైవ్‌ను ఆధారంగా తీసుకోవడం ఎవిడెన్స్ చట్టం కింద చెల్లుబాటు అవుతుందని, జయా మినరల్స్, ఈశ్వర్ సిమెంట్స్ వంటి కంపెనీలు కాగితాలపై మాత్రమే ఉన్నాయని, వాస్తవంగా లేవని వివరించింది. లీజు బదిలీలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపించింది.
వాదనలు విన్న జస్టిస్ కె. సుజన తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు.

