• కూటమిలో వాటా పెంచాలంటున్న సీనియర్లు
  • కార్యవర్గం కూర్పు కత్తిమీద సామే
  • కూటమితో సమన్వయం చేసుకుంటూ పార్టీ విస్తరణ పెద్ద టాస్కే

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బాద్యతలు చేపట్టిన పీవీఎన్‌.మాధవ్‌ ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి. ఆయన పదవి బాధ్యతలు స్వీకరించగానే… అదే వేదికపై మాట్లాడిని బీజేపీ శాసనసభ్యులు అనేక సమస్యలను నూతన అధ్యక్షుడి ముందు ఏకరువు పెట్టారు. ప్రధానంగా కూటమిలో వాటా పంపకాలపై పార్టీ సీనియర్లు అందరూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నామినేటెడ్‌ పదవుల నియామకాల్లో టీడీపీకి 80 శాతం, జనసేనకు 15 శాతం, బీజేపీకి ఐదు శాతమా అని బీజేపీ నేతలు అసహనం వెలిబుచ్చారు. టీడీపీ, జనసేనలకు జరిగినట్లు బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని, కూటమి నేతలతో ఈ అంశాలను మాధవ్‌ చర్చించాలని అనకాపల్లి బీజేపీ ఎంపీ సీయంరమేష్‌ అప్పుడే బీజేపీ నూతన అధ్యక్షుడిపై పెద్ద బాధ్యతే పెట్టారు. ఇదే సమస్యను ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌ రాజు, ఆదినారాయణరెడ్డి, బీజేపీ మాజీ అధ్యక్షుడు సోమువీర్రాజులు కూడా ప్రస్తావించి మాధవ్‌ పై ఒత్తిడి పెంచుతున్నారు. ఇంకా పూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టకుండానే ఏపీ బీజేపీ అధ్యక్షుడికి అనేక సవాళ్ళు స్వాగతం పలుకుతున్నాయి.

నిన్నటి వరకూ చంద్రబాబు బంధువైన పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న సమయంలో పార్టీలో ఇటువంటి డిమాండ్లు ఎవరూ చేయలేదు. అయితే మాధవ్‌ బాధ్యతలు చేపట్టీచేపట్టగానే ఆయన ముందు అనేక ఇష్యూలను లేవనెత్తుతున్నారు. వాస్తవానికి మాధవ్‌ కు చంద్రబాబుకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే, కూటమి పొత్తు చిత్తు కాకుండా జాగ్రత్తపడతాడనే ఉద్దేశంతోనే బీజేపీ అధిష్టానం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్‌ ని ఎంపిక చేశారు. ఓ పక్కన కూటమిలో సయోధ్య చెడకుండా మెయింటైన్‌ చెయ్యడం… అదే సమయంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి వీలైతే పార్టీని అధికారం కైవశం చేసుకునే విధంగా సమాయత్తం చేయ్యడం… అది సాధ్యం కాకపోతే కనీసం బార్గైనింగ్‌ కెపాసిటీని పెంచునే స్ధాయికైనా పార్టీని తీసుకు రావడం మాధవ్‌ ముందున్న సవాళ్లు. ఇందుకు రాష్ట్రంలో పార్టీ విస్త్రత స్ధాయిలో నిర్మాణం జరగాలి. ఇందుకు కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన బీజేపీ విస్తరణకు అంగీకరించవు. బీజేపీలో ఎవరిని చేర్చుకోవాలన్నా ఈ రెండు పార్టీల క్లియరెన్స్‌ తీసుకోవాల్సిన పరిస్ధితులు ఇప్పటి వరకూ ఉన్నాయి. ఆ అనధికార నిబంధనలను తోసిరాజని మాధవ్‌ పార్టీ సంస్ధాగత నిర్మాణం చేపట్టాలని, చేరికలు ఎక్కువగా చేయాలని బీజేపీ క్యాడర్‌ కోరుకుంటోంది. మరి మాధవ్‌ పార్టీ విస్తరణకు ఎటువంటి శషబిషలు లేకుండా నడుం బిగిస్తారా లేక మునుపటిలాగే ఎవరినైనా పార్టీలో చేర్చుకోవలంటే కూటమి అంగీకారం కోసం ఎదురు చూస్తారా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది.

ఓ పక్కన మాధవ్‌ కు ఇంత పెద్ద టాస్క్‌ ముందు ఉండగా పార్టీ సీనియర్లు మన వాటా పెంచాలంటూ మరో క్లిష్టమైన టాస్క్‌ మాధవ్‌ భుజాలపై మోపారు. కూటమి భాగస్వామ్య పక్షంగా నామినేటెడ్‌ పదవుల్లో ఇప్పుడు పొందుతున్న ఐదు శాతాన్ని మాధవ్‌ ఎంత వరకూ పెంచగలరనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే ప్రస్తుతానికైతే కూటమి బీటలు వారడానికి బీజేపీ అధిష్టానం అంగీకరించే పరిస్ధితి లేదు. దీంతో తమవారికి పదవులు కావాలని టీడీపీని డిమాండ్‌ చేసే పరిస్ధితి ఇప్పటికిప్పుడు మాధవ్‌ కి ఉండకపోవచ్చు. ఇక వీటన్నింటికంటే మాధవ్‌ ముందు ఉన్న పెద్ద టాస్క్‌ పార్టీలో ఉన్న వర్గాలను సమన్వయం చేసుకోవడం. ఎంత దాచినా బీజేపీలో చంద్రబాబు అనుకూలురు… వ్యతిరేకులు ఉన్నారన్నది జగద్విదితం. ఇంతకాలం పురంధేశ్వరి అధ్యక్ష స్ధానంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు వ్యతిరేక బీజేపీ నేతలు కిమ్మనకుండా మిన్నుకుండి పోయారు. కానీ ఇప్పుడు వారు ఒక్కొక్కరూ మాట్లాడం ప్రారంభించారు. వీరందినీ సంతృప్తి పరచి పార్టీని ముందుకు నడిపించాలి. అలాగే గడచిన దశాబ్ధంన్నరగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గం కూర్పు ఎప్పుడూ వివాదాస్పదమే అవుతోంది. ఈ సారి కార్యవర్గ కూర్పు మాధవ్‌ కి కత్తిమీద సాములాంటిదే. గచిన రెండేళ్ళలో ఒరిజనల్ బీజేపీ నాయకులు, సంఘం నుంచి వచ్చి బీజేపీలో పనిచేస్తున్న నాయకులకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. పురంధేశ్వరి అన్ని పదవుల్లో తనవాళ్ళని, టీడీపీ అనుకూల నాయకులను పెట్టుకున్నారనే విమర్శ ఉంది. ఈసారి కార్యవర్గంలో ఓజీ బీజేపీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. ఇవన్నీ అధిగమించి మాధవ్‌ ఏ విధంగా పార్టీని వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేస్తారో వేచి చూడాలి.

Politent News Web 1

Politent News Web 1

Next Story