డిసెంబరు 31న తుది నోటిఫికేషన్ జారీ అవకాశం!

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సచివాలయంలో ఉన్నతాధికారులు, మంత్రులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ప్రకటించిన మదనపల్లె, పోలవరం (రంపచోడవరం), మార్కాపురం కొత్త జిల్లాలతో పాటు వచ్చిన అభ్యంతరాలు, స్థానిక నేతల ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించారు.

సమావేశంలో రాజంపేటను కడప జిల్లాలో కలిపే అంశం, అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిని మదనపల్లె జిల్లాలో విలీనం చేయడం పై లోతైన చర్చ జరిగింది. దీంతో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పడితే రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 29కి చేరనుంది. అయితే, తాజా ప్రతిపాదనల దృష్ట్యా 28 జిల్లాలకే పరిమితం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది.

ఇందులో భాగంగా దొనకొండ, కురిచేడు ప్రాంతాలను మార్కాపురం జిల్లాలో చేర్చడం, పొదిలి ప్రాంతాన్ని ప్రకాశం జిల్లాలో కలపడం పైనా సానుకూలంగా చర్చించారు. అలాగే స్థానిక నాయకుల వినతుల మేరకు గూడూరును నెల్లూరు జిల్లాలో, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో విలీనం చేసే అవకాశాలను పరిశీలించారు.

ఈ సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నారాయణ ముఖ్యంగా పాల్గొన్నారు. ఆదివారం మరోసారి చర్చలు జరిపి, సోమవారం కేబినెట్ సమావేశంలో ఉపసంఘం ప్రతిపాదనలను ఆమోదించే అవకాశం ఉంది. క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత డిసెంబరు 31న తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు సమాచారం.

పరిపాలనా సౌలభ్యం, ప్రజల అవసరాలు, స్థానిక డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ఈ పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయాలతో రాష్ట్రంలో పరిపాలన మరింత సమర్థవంతంగా సాగే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story