Vijayawada Utsav: తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ రాకతో విజయవాడ నగరం దద్దరిల్లిపోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక విజయ్ తొలిసారి మరో రాష్ట్రానికి వచ్చారని, ఆ గడ్డ పవిత్రమైన విజయవాడ కావడం దుర్గమ్మ తల్లి ఆశీస్సులేనని సంతోషం వ్యక్తం చేశారు.

మంగళవారం పున్నమి ఘాట్‌లో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమంలో ఇద్దరు సీఎంలు ఒకే వేదికను పంచుకున్నారు. ఉండవల్లిలో చంద్రబాబుతో భేటీ అనంతరం విజయ్ ఇక్కడకు చేరుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన తర్వాత చంద్రబాబు ప్రసంగించారు. దుర్గమ్మ, భారత్ మాత, తెలుగు తల్లికి జయజయధ్వానాలు పలుకుతూ మాట్లాడిన ఆయన, సభలోని యువత ఉత్సాహాన్ని చూసి పులకించిపోయారు. “విజయ్ రాకతో మీ ఉత్సాహం చూస్తుంటే విజయవాడ దద్దరిల్లిపోతోంది” అని సభికులను ఉత్తేజపరిచారు.

పార్టీ పెట్టిన కేవలం రెండేళ్లలోనే విజయ్ సీఎం అయ్యారని, తమిళనాడు అభివృద్ధికోసం కంకణం కట్టుకున్నారని చంద్రబాబు కితాబిచ్చారు. ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న అధికారులు, స్థానిక నేతలను ప్రశంసించారు. రాష్ట్రాలు వేరైనా అభిమతం ఒక్కటేనని, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక సహా అన్ని రాష్ట్రాలు బాగుండాలని, దేశం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏదైనా సాధ్యమేనని చెబుతూ, దుర్గమ్మ ఆశీస్సులతో గోదావరి-కావేరి అనుసంధానం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణ, పెన్నా, తుంగభద్ర, కావేరి అనే ఐదు నదులు అనుసంధానం అయితే నాలుగు రాష్ట్రాలు సస్యశ్యామలమవుతాయని వివరించారు. యువత ఉత్సాహం చూస్తుంటే 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నంబర్‌వన్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. టెక్నాలజీ, నాలెడ్జ్‌తో పాటు ఆధ్యాత్మికత కూడా అవసరమని, ఇలాంటి ఉత్సవాలు ఆ స్ఫూర్తిని నింపుతాయని అన్నారు.

అనంతరం విజయ్ మాట్లాడుతూ ‘అందరికీ నమస్కారం’ అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. విజయవాడకు రావడం చాలా సంతోషంగా ఉందని, దసరా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. నదుల అనుసంధానం గురించి చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపి, ప్రజలు అందించిన ఘనస్వాగతానికి కృతజ్ఞతలు తెలిపారు.

Next Story