కేంద్ర మంత్రులతో వరుస భేటీలు

Chandrababu Naidu Busy in Delhi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులైన సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్, సర్బానంద సోనోవాల్‌లతో ఆయన వరుసగా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.

ముందుగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసిన చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విడుదలపై చర్చించారు. విభజన హామీల్లో భాగంగా మంజూరైన ప్రాజెక్టులకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి నీటి భద్రత అత్యంత ముఖ్యమని, సాగు-తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. కేంద్ర-రాష్ట్ర సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.

2025-26 ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించాలని చంద్రబాబు విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.524.41 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపి, కేంద్ర వాటా నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన సీఎం.. పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా ఏపీకి సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి రాబోయే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు. పోలవరం-నల్లమల సాగర ప్రాజెక్టుకు కూడా చేయూత అందించాలని వినతి పత్రాలు అందజేశారు.

చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు ఉన్నారు.

ఇక కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో జరిగిన భేటీలో దుగరాజపట్నం షిప్‌బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి కేంద్ర సహకారం కోరారు. కేంద్రం తీసుకొచ్చిన నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణ విధానాలకు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు.. ‘చిప్ టు షిప్’ విజన్‌కు అనుగుణంగా రంగాన్ని బలోపేతం చేయాలని సూచించారు.

ఫేజ్-1లో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి రూ.1,361.49 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రం రూ.782.29 కోట్లు వెచ్చించినా, మిగతా హార్బర్లకు కేంద్ర నిధులు ఇంకా రాలేదని గుర్తుచేశారు. మొత్తంగా రూ.590.91 కోట్ల కేంద్ర సాయం అవసరమని విజ్ఞప్తి చేశారు.

ఈ భేటీల ద్వారా రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సానుకూల స్పందన లభిస్తుందని అధికార వర్గాలు ఆశిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story