Singapore Tuas Port : సింగపూర్ టువాస్ పోర్టును సందర్శించిన చంద్రబాబు
సింగపూర్ భాగస్వామ్యంతో ఏపీలో అత్యాధునిక పోర్టుల నిర్మాణంపై అధ్యయనం

ఆసియాలోనే రెండొవ అతిపెద్ద పోర్ట్ అయిన టువాస్ పోర్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి బృందం సోమవారం సందర్శించింది. ఐదు రోజుల పాటు సింగపూర్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు బృందం సోమవారం టువాస్ పోర్ట్ కు వెళ్లి పరిశీలించింది. ఈ సందర్భంగా పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీ రీజనల్ సీఈఓ విన్సెంట్ తో సీయం చంద్రబాబు భేటీ అయ్యారు. ఆసియా ఖండంలోనే రెండొవ అతిపెద్ద కంటైనర్ టెర్మినల్ పోర్టుగా టువాస్ పోర్టును నిర్మిస్తున్నట్లు అధికారులు సీయం చంద్రబాబుకు వివరించారు. టువాస్ పోర్టులో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఆటోమేషన్ సిస్టంమ్ వ్యవస్ధను చంద్రబాబు ఆసక్తిగా పరిశీలించారు. ఏపీలో మరిన్ని పోర్టులు నిర్మించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు బృందం టువాస్ పోర్ట్ ను సందర్శించారు. ఏపీలో కూడా పోర్ట్ ఆపరేషన్స్, కార్గో హ్యాండ్లింగ్ తదితర అంశాల్లో ఆటోమేషన్, ఏఐ టెక్నాలజీ వినియోగించడానికి వీలుగా టువాస్ పోర్ట్ ఆపరేషన్లను చంద్రబాబు బృందం అధ్యయనం చేసింది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, పారిశ్రామిక కారిడార్లతో ఏపీనీ లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దేందుకు టువాస్ పోర్టు అనుసరిస్తున్న విధానాలు ఎంత వరకూ మన రాష్ట్రంలో అమలు చేయవచ్చనే అంశంపై అక్కడి అధికారులతో చర్చించారు. పోర్టు ఆధారిత పరిశ్రమలు ఎటువంటివి ఉంటాయి, పోర్టు కార్యకలాపాల నిర్వహణ తదితర అంశాలను సీయం చంద్రబాబు టువాస్ పోర్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సింగపూర్ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ లో నిర్మించ తలపెట్టిన పోర్టులను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే అవకాశాలపై సింగపూర్ అధికారులతో ముఖ్యమంత్రి బృందం సమాలోచనలు జరిపారు. టువాస్ పోర్టుని సందర్శించిన వారిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, టీజీభరత్‌లు ఉన్నారు.
