CM Chandrababu: పల్నాడులో రౌడీయిజం చేస్తే సహించను: సీఎం చంద్రబాబు హెచ్చరిక
రౌడీయిజం చేస్తే సహించను: సీఎం చంద్రబాబు హెచ్చరిక

CM Chandrababu: వైసీపీ నేతలు పల్నాడులో రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ప్రజలపై దాడులు చేస్తే సహించేది లేదని, వారు జాగ్రత్తగా ఉండాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు. మాచర్లలో జరిగిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వ హయాంలో మాచర్లలో ప్రజాస్వామ్యం లేదని, అనేక అరాచకాలు జరిగాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో మాచర్ల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని, ఆనందం వ్యక్తమవుతోందని తెలిపారు.
గతంలో ఆత్మకూరు రాకుండా తనను అడ్డుకున్నారని, మున్సిపల్ ఎన్నికల సమయంలో దాడులు చేశారని సీఎం గుర్తుచేశారు. ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడాలని పిలుపునిచ్చారు. చెత్త పన్ను తొలగించడంతోపాటు చెత్త రాజకీయాలను కూడా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఎవరి ప్రవర్తన బాగాలేకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. పల్నాడులో రౌడీయిజాన్ని అణచివేస్తానని, చెత్త రాజకీయాలను తొలగిస్తానని తెలిపారు.
సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, పేదరికం లేని సమాజ నిర్మాణమే ధ్యేయమని చెప్పారు. దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు ఇస్తున్నామని ప్రకటించారు. కొందరు మాటలు మాత్రమే చెబుతారని, తాము చేతల్లో చూపిస్తామని స్పష్టం చేశారు. అందరికీ ఆదాయం పెరగాలనేది తన లక్ష్యమని ఉద్ఘాటించారు. వాట్సాప్ ద్వారా అన్ని సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. చెత్త నుంచి సంపద సృష్టించే అవకాశం ఉందని, త్వరలో రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. జూన్ 26వ తేదీకి ఏపీని ప్లాస్టిక్ రహితంగా చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
