YS Jagan : చంద్రబాబు సర్కార్ రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తోంది
రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని మండిపడ్డ వైఎస్.జగన్

చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ భయానక వాతావరణం సృష్టిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్.జగన్మోహనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్.జగన్ మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని మండిపడ్డారు. బీసీ మహిళ అయిన కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారికపై దాడి చేయడమే ఇందుక నిదర్శనమన్నారు. టీడీపీ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని అడిగినందుకు టీడీపీ సైకోలు హారికపై దాడి చేశారని వైఎస్.జగన్ అన్నారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగినా వారు ప్రేక్షక పాత్ర పోషించారని విమర్శించారు. చేతిలో అధికారం ఉంది కదా అని చంద్రబాబు శాడిస్టులా ప్రవర్తిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఒక బీసీ మహిళను మహానటి అనడానికి సిగ్గు ఉండాలని జగన్ ఆగ్రహించారు. హారికపై దాడి చేసిన వారిలో ఇప్పటి వరకూ ఎంత మందిపై కేసులు పెట్టారని జనగ్ ప్రశ్నించారు. పైపెచ్చు బాధితులపైనే పోలీసులు దగ్గిరుండి కేసులు పెడుతున్నారని వైఎస్.జగన్ మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబు 143 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా అడ్డగోలుగా పాలన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్‌జగన్ విమర్శించారు. చంద్రబాబు మోసాలను ప్రశ్నిస్తున్న ఏకైక పార్టీ వైఎస్‌ఆర్‌సీపీనే అని రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టమొచ్చినా పలుకుతున్నది కూడా మేమే అని జగన్ చెప్పారు. రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, కరెంట్ ఛార్జీలపై వైఎస్‌ఆర్‌సీపీనే పోరు చేసిందని తెలిపారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు తెలియజేస్తున్నామని ఇది తట్టుకోలేకే మా నాయకులు, కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారని అన్నారు. ఒక రాజకీయపార్టీకి ఉన్న హక్కులు ఏవో చంద్రబాబుకు తెలియదా అని జగన్ నిలదీశారు. ప్రజల దగ్గరకు వెళ్లడం, సమావేశాలు పెట్టడం రాజకీయ పార్టీల హక్కులు కావా వాటిని ఎందుకు అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్.జగన్ నిలదీశారు.
బీహార్ లో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనేది చంద్రబాబు ఆలోచన చేసుకోవాలని జగన్ అన్నారు. రాష్ట్రంలో డీఐజీ అనే అతను మాఫియా డాన్ గా పనిచేస్తున్నారని, వాళ్ళ ఆధ్వర్యంలో సీఐలు డబ్బులు వసూలు చేసి ఎమ్మెల్యేలకు, చినబాబుకు పంపుతున్నారని వైఎస్‌జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. అనేక మంది ఐపీఎస్‌లపై కక్ష సాధింపు చర్యలు దిగుతున్నారని, ఐపీఎస్‌లు మన రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నారని చెప్పారు. పొగాకు రైతులకు సంఘీభావం తెలిపితే నాపై మూడు కేసులు పెట్టారని రైతులకు అండగా నిలబడితే మీకు వచ్చిన నష్టం ఏంటి చంద్రబాబుని నిలదీశాలు. సినిమా డైలాగులు పోస్టర్లు గా పెట్టినందుకు ఐదుగురు పై కేసులు పెట్టారు. పవన్ కళ్యాణ్, బాల కృష్ణ సినిమాల్లో ఇంత కన్నా పెద్ద పెద్ద డైలాగులు ఉన్నాయి. సినిమా డైలాగులు నచ్చక పోతే సెన్సార్ వాళ్ళతో చెప్పి డైలాగులు ఆపండని జగన్ అన్నారు. ప్రశన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా దాడి చేయించుకున్న ప్రశన్న కుమార్ పై కేసులు పెట్టారని మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో దుష్ట సంప్రదాయం తీసుకువచ్చారు… ఇదే సంప్రదాయం మా ప్రభుత్వం వచ్చిన తరువాత చేస్తే మీ పరిస్తితి ఏంటి అని వైఎస్.జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు చాలా అంటే చాలా తప్పు చేస్తున్నారని మీరు చేసే ఈ సంప్రదాయం విష వృక్షం అవుతుందని వైఎస్.జగన్ హెచ్చరించారు. నేను చెప్పినా కూడా మా వాళ్ళు వినే పరిస్ధితి ఉండదు కాబట్టి ఇప్పటికైనా మేలుకుని తప్పు తెలుసుకోమని వైఎస్.జగన్ సీయం చంద్రబాబుకు హితవు పలికారు.
