Chandrababu’s Positive Response: చంద్రబాబు సానుకూల స్పందన: గ్రేటర్ విజయవాడతో భవిష్యత్తు వికాసం
గ్రేటర్ విజయవాడతో భవిష్యత్తు వికాసం

Chandrababu’s Positive Response: విజయవాడ నగరాన్ని గ్రేటర్ విజయవాడగా అభివృద్ధి చేయాలన్న దీర్ఘకాలిక ప్రతిపాదనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లు సచివాలయంలో సీఎంను కలిసి ఈ మేరకు నివేదిక సమర్పించారు. పెనమలూరు, మైలవరం, గన్నవరం నియోజకవర్గాల్లోని 75 గ్రామాలను విజయవాడతో విలీనం చేయడం ద్వారా గ్రేటర్ నగరాన్ని ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రాంతాలు ఇప్పటికే అనధికారికంగా విజయవాడ నగరంతో అనుసంధానమై ఉన్నాయని ఎంపీ శివనాథ్ సీఎంకు వివరించారు. గ్రేటర్ విజయవాడ ఏర్పాటుతో చుట్టుపక్కల గ్రామీణ, మున్సిపల్ ప్రాంతాల్లో ఎదురవుతున్న అనేక సమస్యలకు స్థిరమైన పరిష్కారాలు లభిస్తాయని నివేదికలో పేర్కొన్నారు.
గ్రేటర్‌తో లభించే ప్రయోజనాలు:
మౌలిక సదుపాయాలు: శివారు ప్రాంతాల్లో చెత్త నిర్వహణ, మురుగునీటి వ్యవస్థ, డ్రైనేజీ, తాగునీరు సరఫరా, రహదారులు, వీధి దీపాలు వంటివి దారుణంగా ఉన్నాయి. గ్రేటర్ ఏర్పాటుతో ఆధునిక మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయి.
నియంత్రిత అభివృద్ధి: అక్రమ లేఔట్లు, అనధికార నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ అరాచకం పెరుగుతున్న నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ ద్వారా క్రమబద్ధమైన నగర విస్తరణ సాధ్యమవుతుంది.
ఆర్థిక అవకాశాలు: పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్ హబ్‌లు, పర్యాటక పెట్టుబడులు పెరిగి ఉపాధి కల్పన మెరుగుపడుతుంది.
పరిపాలనా సౌలభ్యం: ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మధ్య పరిపాలనా విభజన వల్ల పోలీసు, రవాణా, శాంతిభద్రతలు, విమానాశ్రయ నిర్వహణలో ఎదురవుతున్న ప్రొటోకాల్ సమస్యలు తొలగిపోతాయి.
ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనపై తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎంఓ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారని ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ కల సాకారమవుతుందన్న ఆశాభావం ప్రజల్లో నెలకొంది. గ్రేటర్ విజయవాడ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోనే అతిపెద్ద మహానగరంగా విజయవాడ మారనుంది.

