Chandram Palem Government School: రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటైన భీమిలి నియోజకవర్గం పరిధిలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల సరికొత్త రూపురేఖలు సంతరించుకుంది. శనివారం ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఈ పాఠశాలను సందర్శించి, సుమారు రూ.6.5 కోట్ల నిధులతో చేపట్టిన పునర్నిర్మాణ, అభివృద్ధి పనులను ప్రారంభించారు.

మంత్రి లోకేశ్‌తో పాటు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ పాల్గొన్నారు. పాఠశాలలో తాగునీటి ఆర్వో ప్లాంట్, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్‌బాల్ కోర్టులు, వాకింగ్ ట్రాక్‌లను మంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో వాలీబాల్, బాస్కెట్‌బాల్ ఆడి సందడి చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మంత్రికి ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ సరదాగా మాట్లాడుతూ ‘‘చంద్రంపాలెం పాఠశాలకు రావడం ఇది మూడో సారి. వచ్చిన ప్రతి సారీ భారీ వర్షం కురుస్తోంది. ఈ పాఠశాల పేరు చెబితే వర్షం గుర్తొస్తుంది. మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పాఠశాలకు కూడా నేను మూడుసార్లు వెళ్లలేదు’’ అని వ్యాఖ్యానించారు.

‘ప్రాజెక్టు చంద్ర’తో అధునాతన సౌకర్యాలు

ఈ పాఠశాల అభివృద్ధికి దివీస్ లేబొరేటరీస్ సంస్థ సీఎస్‌ఆర్ నిధులు అందించింది. ‘ప్రాజెక్టు చంద్ర’ పేరిట రూ.6.5 కోట్లు వెచ్చించి డ్రైనేజీ వ్యవస్థ, అత్యాధునిక క్రీడా మైదానం, సీసీ ఫ్లోరింగ్‌తో కూడిన దారులు, మూడు ఆర్వో ప్లాంట్లు, ‘చంద్రవదన’ పేరిట భారీ కళావేదిక, ల్యాండ్‌స్కేపింగ్, భవనాలకు రంగులు వేయడం వంటి పనులు చేపట్టారు. మొత్తం సుమారు రూ.10 కోట్లకు పైగా నిధులతో అధునాతన సౌకర్యాలు కల్పించారు.

పాఠశాలలో ప్రస్తుతం 6 నుంచి 10వ తరగతి వరకు 2,906 మంది విద్యార్థులు చదువుతున్నారు. 62 తరగతి గదులు, సోలార్ సదుపాయంతో కూడిన వేర్వేరు మరుగుదొడ్లు, 50కి పైగా కంప్యూటర్లతో ల్యాబ్, ఏఐ ల్యాబ్, 4,800కు పైగా పుస్తకాలున్న గ్రంథాలయం ఉన్నాయి. ఏటా ఇక్కడి విద్యార్థులు పదుల సంఖ్యలో ఐఐటీ సీట్లు సాధిస్తూ, క్రీడల్లోనూ రాణిస్తున్నారు.

జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న పాఠశాలలో విద్యార్థులు రోడ్డు దాటే సమయంలో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రూ.3.23 కోట్లతో వంతెన నిర్మాణం చేపట్టి, పనులు తుది దశలో ఉన్నాయి.

ప్రభుత్వ పాఠశాలలకు తలమానికంగా నిలిచిన చంద్రంపాలెం పాఠశాల ఇప్పుడు మరిన్ని అధునాతన సౌకర్యాలతో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story