మావోయిస్టు ఉద్యమం దెబ్బతింది: చెల్లూరి నారాయణరావు

Chelluri Narayana Rao: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైద్ధాంతిక రాజకీయాలు, ఎత్తుగడలను మార్చుకోవడంలో మావోయిస్టు పార్టీ విఫలమైందని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు అన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ప్రజల ఆలోచనలకు భిన్నంగా పార్టీ విధానాలు ఉండటం వల్లే ఉద్యమం దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మారుమూల ఆదివాసీ పల్లెలకు కూడా చేరుతున్నాయని, దానికి తగినట్లుగా పార్టీ అప్‌డేట్ కాలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. డీజీపీ ఎదుట లొంగిపోయిన చెల్లూరి నారాయణరావు విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు.

1990లో ఉద్దానం ప్రాంతంలో చేరిన నేను...

“ఉద్దానం ప్రాంతంలో ప్రజా ఉద్యమాలకు ఆకర్షితుడై 1990లో పీపుల్స్ వార్‌లో చేరాను. అప్పటికి, ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. కానీ పార్టీ మాత్రం మూస పద్ధతిలోనే ఉండిపోయింది. అందుకే ప్రజల్ని ఆకర్షించలేకపోయింది. కొత్తగా పార్టీలోకి రిక్రూట్‌మెంట్‌లు లేకుండా పోయాయి. మావోయిస్టు ఉద్యమం దెబ్బతినడానికి ఇవన్నీ కారణాలే” అని ఆయన వివరించారు.

సాయుధ పోరాటం వదిలేసి ప్రజాస్వామ్యయుతంగా కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నట్లు చెల్లూరి నారాయణరావు తెలిపారు. తనకు వ్యక్తిగతంగా ఎవరిపైనా శత్రుత్వం లేదని, పార్టీ నిర్ణయాలు, తీర్మానాలకు అనుగుణంగా మాత్రమే కొన్ని ఘటనల్లో పాల్గొన్నానని, వాటి పట్ల విచారం వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యలు మావోయిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేస్తున్నాయి. ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధి కార్యక్రమాలు మారుతున్న నేపథ్యంలో సైద్ధాంతిక రాజకీయాలను పునరాలోచించాల్సిన అవసరాన్ని ఆయన సూచించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story