Justice Suryakant: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అమరావతిలో జ్యుడిషియల్ అకాడమీకి శంకుస్థాపన
అమరావతిలో జ్యుడిషియల్ అకాడమీకి శంకుస్థాపన

Justice Suryakant: రాజధాని అమరావతికి న్యాయ వ్యవస్థ పరంగా మరింత శోభ చేకూర్చేలా పలు కీలక నిర్మాణాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ శ్రీకారం చుట్టారు. ఆదివారం (మార్చి 1, 2026) సీజేఐ తిరుపతి నుంచి విజయవాడ చేరుకుని, గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా అమరావతికి వచ్చారు. అక్కడ పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
తుళ్లూరు మండలం పిచ్చుకలపాలెం వద్ద ఏర్పాటు కానున్న ‘ఏపీ జ్యుడిషియల్ అకాడమీ’ నిర్మాణానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి, జస్టిస్ జోయ్ మల్య బాగ్చి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం మొదలుకావడానికి ముందు వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల మధ్య పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. శంకుస్థాపన అనంతరం జ్యుడిషియల్ అకాడమీ, రాజధాని అభివృద్ధి పనులపై తయారు చేసిన వీడియో డాక్యుమెంటరీని అతిథులు వీక్షించారు.
ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణం రూ.165 కోట్లతో చేపట్టనున్నారు. ఇది 2.05 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పడనుంది. ఒకేసారి 120 మంది ట్రైనీ జడ్జిలకు శిక్షణ ఇచ్చే విధంగా రూపొందించారు. అకాడమిక్ బ్లాక్, హాస్టల్, స్పోర్ట్స్ సౌకర్యాలు, 500 సీట్ల అత్యాధునిక ఆడిటోరియం, జీ ప్లస్ 8 అంతస్తుల భవనాలతో అంతర్జాతీయ ప్రమాణాల్లో నిర్మాణం జరగనుంది. హైకోర్టు నుంచి 5.7 కి.మీ. దూరంలో ఉంది.
అనంతరం సీజేఐ నేలపాడు గ్రామం సమీపంలోని హైకోర్టు పరిసరాల్లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాన్ని ప్రారంభించారు. అదే సమయంలో హైకోర్టు అతిథి గృహం, క్లబ్ భవనాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు, జీఏడీ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌కుమార్, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ పురుషోత్తంకుమార్ తదితర అధికారులు, న్యాయాధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాలు అమరావతిని ఆధునిక న్యాయ నగరంగా (Justice City) తీర్చిదిద్దే దిశగా ముఖ్యమైన అడుగులుగా పరిగణించబడుతున్నాయి.

