Chief Minister Nara Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాష్ట్ర సచివాలయంలో రెండు ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించారు. మొదట రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం 2024-26 ప్రగతి నివేదికను విడుదల చేసి విలేకరులతో మాట్లాడారు. తర్వాత విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రెండేళ్లలో పేదలకు రూ.1,49,401 కోట్లు

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గత రెండేళ్లలో పేదలకు సంక్షేమం రూపంలో రూ.1,49,401 కోట్లు అందించామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు మించి సంక్షేమం అమలు చేస్తున్నామని, రాష్ట్రంలో ఇంతవరకు ఇంత మొత్తంలో సంక్షేమం కోసం ఖర్చు చేయలేదని ఆయన అన్నారు.

ఉద్యోగులకు రూ.30,849 కోట్ల బకాయిలు, ఇతర బకాయిలు రూ.19,357 కోట్లు చెల్లించామని, కేంద్ర ప్రాయోజిత పథకాలకు పెండింగ్‌లో ఉన్న రూ.8,695 కోట్లు రాష్ట్రం చెల్లించిందని వెల్లడించారు. కేంద్ర వాటా నిధులు కలిపి ఈ రెండేళ్లలో రూ.45,138 కోట్లు ఖర్చు చేశామని, వివిధ కేటగిరీల్లో 30,607 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు.

2024 నాటికి రాష్ట్ర అప్పు రూ.9.74 లక్షల కోట్లకు చేరిందని, నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రం అప్పులను భరించలేని పరిస్థితికి చేరిందని సీఎం గుర్తు చేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపు, హామీల అమలు, అభివృద్ధి, పెట్టుబడులపై దృష్టి, మంచి పాలన అనే నాలుగు మార్గాలు ఎంచుకున్నామని చెప్పారు. 370 రుణాలపై వడ్డీ తగ్గించి ఏడాదికి రూ.1,100 కోట్లు ఆదా చేశామని, అప్పు తీరేనాటికి రూ.8,269 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు.

మూలధన వ్యయాన్ని గత రెండేళ్లలో గణనీయంగా పెంచి ప్రస్తుతం రూ.32,005 కోట్లు ఖర్చు చేస్తున్నామని, దీన్ని ఇంకా పెంచుతామని అన్నారు. 43 లక్షల మంది ఎస్సీ లబ్ధిదారులకు రూ.19,100 కోట్లు, 118 లక్షల మంది బీసీ లబ్ధిదారులకు రూ.32,534 కోట్లు, 17 లక్షల మంది మైనారిటీలకు రూ.4,856 కోట్లు అందించామని వివరించారు.

రాష్ట్రంలో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు చేసుకున్నామని, ప్రస్తుతం రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులు పట్టాలకెక్కాయని, వీటితో 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. జీఎస్‌డీపీలో అప్పుల వాటా 36.20 శాతంగా ఉందని, రాబోయే రోజుల్లో దీన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేసి కేంద్ర సహకారాన్ని అందుకున్నామని సీఎం అన్నారు.

విశాఖ ఎకనామిక్ రీజియన్‌పై స్పెషల్ ఫోకస్

అదే రోజు విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. వీఈఆర్ ప్రాజెక్టు ద్వారా వివిధ రంగాల్లో రూ.9.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రభుత్వం రూ.3.50 నుంచి రూ.4 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతుందని, ప్రైవేట్ రంగం నుంచి రూ.5.30 లక్షల కోట్లు రాబట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు.

బేసిటీ ప్రాజెక్ట్‌ను యాంకర్ ప్రాజెక్టుగా తీసుకుని విశాఖ రీజియన్ అభివృద్ధి చేపట్టాలని, సూక్ష్మ స్థాయి ప్రణాళిక ద్వారా మొత్తం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే వీఈఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏఐ డేటా సెంటర్లు, పోర్టు ఆధారిత పరిశ్రమలు, టూరిజం, హైడ్రోజన్, క్లీన్-టెక్ ఎనర్జీలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మూలపేట పోర్టు నుంచి రాజమహేంద్రవరం అఖండ గోదావరి ప్రాజెక్టు వరకు వీఈఆర్ అభివృద్ధిలో భాగం కావాలని సూచించారు. నిధుల కన్వర్జెన్స్ ద్వారా అభివృద్ధి చేపట్టాలని, అవసరమైన చోట వీజీఎఫ్ స్కీమ్ అమలు చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశాలకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, సీఎస్ సాయిప్రసాద్ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story