Chief Minister Nara Chandrababu Naidu: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల నిరంతర ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి మండలి ఆయనను ఘనంగా అభినందించారు. బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో 12 కీలక అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అభినందన తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు.

మోదీ పరిపాలన, సంస్కరణలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితర మంత్రులు ప్రశంసించారు. రెండు పేజీల తీర్మానాన్ని మంత్రి నారా లోకేశ్ చదివి వినిపించారు. సీఎంగా, ప్రధానిగా 25 ఏళ్లు పనిచేసి ప్రజలను మెప్పించడం సామాన్య విషయం కాదని సీఎం చంద్రబాబు అన్నారు. కొంతమంది సీఎంలు 25 ఏళ్లు పనిచేసినా సంస్కరణలు తీసుకురాలేకపోయారని, మోదీ మాత్రం ప్రజలను ఒప్పించి సంస్కరణలు చేశారని ప్రశంసించారు. ప్రధాని మోదీ పాలనా సంస్కరణలు, కట్టుబాట్లను స్ఫూర్తిగా తీసుకుని జిల్లాల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రులకు సూచించారు.

ఇదే సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘‘ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ అద్భుతమైన మైలురాయి. సరైన సమయంలో.. సరైన స్థానం.. సరైన నాయకుడు ఉండటం మన దేశ అదృష్టం. ఆయన దార్శనిక నాయకత్వంలో ‘వికసిత్ భారత్ @2047’ దిశగా భారత్ ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తోంది. ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ రైలు సర్కార్ ప్రజల కోసం అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, అవకాశాలను వేగవంతం చేస్తోంది. వికసిత్ భారత్‌ను నిర్మించే, స్వర్ణాంధ్రప్రదేశ్ దార్శనికతను ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రయాణంలో ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నా. 25 సంవత్సరాల అంకితభావంతో కూడిన ప్రజా సేవను పూర్తి చేసుకున్న మోదీకి హృదయపూర్వక అభినందనలు. ఒక తరం దిశను నిర్దేశించే అవకాశం కొద్దిమంది నాయకులకే లభిస్తుంది. అలాంటి నాయకుల్లో మోదీ ఒకరు. ఆయన నాయకత్వం భారత్‌ను మరింత ఉన్నత శిఖరాలకు నడిపించాలని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

కేబినెట్ సమావేశం తర్వాత సీఎం చంద్రబాబుతో మంత్రి నారాయణ సమావేశమై రాజధానిలోని కేటగిరి-4, ఎండోమెంట్ భూముల అంశంపై చర్చించారు.

Next Story