CM Chandrababu and His Wife: ‘చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయ్’.. రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తిన్న సీఎం చంద్రబాబు దంపతులు
రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తిన్న సీఎం చంద్రబాబు దంపతులు

CM Chandrababu and His Wife: చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, భార్య భువనేశ్వరి దంపతులు రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు (ఐస్ యాపిల్స్) తిని ప్రజల మనసులు గెలుచుకున్నారు. కుప్పంలోని శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత తిరుగు ప్రయాణంలో తంజమ్మకొట్టాలు వద్ద ఈ సంఘటన జరిగింది.
కల్లు గీత కార్మికులు తాటి ముంజలు తీస్తుండటాన్ని చూసి సీఎం దంపతులు వాహనం ఆపి, వారితో సంభాషించారు. ఆ సమయంలో తాజా తాటి ముంజలను రుచి చూశారు. ఈ క్షణాలను ఫొటోల రూపంలో చంద్రబాబు, భువనేశ్వరి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘మన గ్రామీణ ఉత్పత్తులే ఉత్తమం’
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘కల్తీ లేదు.. కార్బైడ్ లేదు.. పురుగు మందుల గోల లేదు. మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన, చల్లని తాటి ముంజలు రోడ్డు పక్క ఆగి తింటుంటే ఎంతో హాయిగా ఉంది. మన గ్రామీణ ఆహార ఉత్పత్తులకు మించింది ఏముంటుంది!’’ అని వ్యాఖ్యానించారు.
భువనేశ్వరి మాట్లాడుతూ, ‘‘తాజా తాటి ముంజలను రుచి చూశాం. చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. కల్లుగీత కార్మికులతో కాసేపు మాట్లాడి వారి వృత్తి సమస్యలు, కుటుంబ పరిస్థితులను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు’’ అని తెలిపారు.
ఈ అనూహ్య సంఘటన సీఎం చంద్రబాబు సామాన్యులతో ఎంతో సన్నిహితంగా ఉంటారని మరోసారి చాటి చెప్పింది. కుప్పం ప్రజలు ఈ ఘటనను హర్షంగా ఆహ్వానించారు.

