CM Chandrababu Naidu: పిల్లలు ఆదాయ మూలాలు.. ప్రభుత్వ పాఠశాలలకు కొత్త ఊపిరి: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu: భవిష్యత్తులో పిల్లలే ఆస్తి. పిల్లలు పుడితే భారం కాదు.. ఆదాయంగా మార్చేశాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పీటీఎం (పేరెంట్ టీచర్ మీటింగ్) కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతమంది పిల్లలున్నా అందరి తల్లుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’ కింద డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ఇప్పటికే 67 లక్షల మంది పిల్లలకు రూ.10,120 కోట్లు జమ చేశామని, గిరిజన ప్రాంతాల్లోనే 5 లక్షల మందికి రూ.664 కోట్లు అందించామని వివరించారు.
ఆర్థిక అసమానతలు తగ్గించడం లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే అభివృద్ధి పనులు నడుపుతున్నామని చంద్రబాబు తెలిపారు. పీ4 కార్యక్రమం ద్వారా పేదలను ఆదుకుంటున్నామన్నారు. అప్పులు కాదు, ఆదాయాన్ని పెంచాలని, పిల్లలు సమాజానికి ఉపయోగపడేలా చేయాలని ఆయన ఉద్ఘాటించారు.
విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని, విద్యా వ్యవస్థకు వెన్నెముక ఉపాధ్యాయులేని చెప్పారు. శనివారం ‘నో బ్యాగ్ డే’ అమలు చేస్తున్నామని, పిల్లలు ఆనందంగా ఉంటే బాగా చదువుతారని, అందుకే వారికి పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. ఆగస్టు నుంచి ‘సంజీవని’ ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వం కృషి చేస్తోందని లోకేశ్ అన్నారు. ‘తల్లికి వందనం’ కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదని, తల్లిని, గురువును గౌరవించడమే దీని ముఖ్య లక్ష్యమని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 43 వేల పాఠశాలల్లో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి చర్చించే వేదికగా ఈ మెగా పీటీఎం ఏర్పాటు చేశామన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావాలని సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చానని, దీనికి తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి కృషి చేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మధ్య సమన్వయం మరింత బలపడి, విద్యా రంగం అభివృద్ధి చెందుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు.

