N. Chandrababu Naidu: సైబరాబాద్‌ నిర్మాణం సమయంలో కూడా ఇదే విమర్శలు వచ్చాయని, ఇప్పుడు రాజధాని అమరావతి నిర్మాణంపై మళ్లీ అదే దుష్ప్రచారం జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జాతీయ మీడియా ప్రతినిధులతో అమరావతిలో ఇష్టాగోష్ఠి నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సైబరాబాద్‌ను నిర్మిస్తున్నప్పుడు రాష్ట్రంలో డబ్బంతా అక్కడే పెట్టేస్తున్నారని నన్ను విమర్శించేవారు. ఇప్పుడు అమరావతి నిర్మాణం జరుగుతుంటే అదే దుష్ప్రచారం చేస్తున్నారు” అని అన్నారు.

చంద్రబాబు మరిన్ని వివరాలు చెప్తూ, సైబరాబాద్‌ నిర్మాణం వల్ల తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం ఏటా రూ.లక్ష కోట్లు ఆదాయం వస్తోందని గుర్తు చేశారు. అదే విధంగా భవిష్యత్తులో అమరావతి కూడా అభివృద్ధి చెంది, రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి రైతులు ఇచ్చిన భూముల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసి, వాటి మానిటైజేషన్‌ ద్వారా చేసిన అప్పులు తీర్చుతామని తెలిపారు.

అమరావతి నిర్మాణంలో వెచ్చించిన మొత్తంలో 15-20 శాతం నిర్మాణ సమయంలోనే జీఎస్టీ, ఇతర పన్నుల రూపేణా ప్రభుత్వానికి ఆదాయంగా వస్తుందని చంద్రబాబు వివరించారు. సైబరాబాద్‌ నిర్మాణ సమయంలో అది అటవీ ప్రాంతం అని, పాములు నిండి ఉండేదని, అప్పటి ఎల్‌ అండ్‌ టీ సీఎండీ సుబ్రమణ్యం కూడా భయపడేవాడని ఉదాహరణగా చెప్పి, ఇప్పుడు ఆ నగరం ఎలా అభివృద్ధి చెందిందో చూడాలని అన్నారు.

ఉద్యోగాల కోసం అమెరికా నుంచి ఏపీకి వస్తారు!

అమరావతిలోని క్వాంటమ్‌ వ్యాలీకి త్వరలో విదేశాల నుంచి మేధావులు, నిపుణులు వస్తారని చంద్రబాబు ప్రకటించారు. ఐబీఎం, వైజర్‌ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు వచ్చి స్థానిక విద్యార్థుల నైపుణ్యాలను గుర్తించి, క్వాంటమ్‌ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వనున్నారు. డిగ్రీ పాఠ్యాంశాల్లో క్వాంటమ్‌ నైపుణ్యాలను చేర్చి విద్యార్థుల స్కిల్స్‌ మెరుగుపరుస్తామని తెలిపారు.

గూగుల్‌ డేటా సెంటర్‌తో పాటు మరిన్ని సంస్థలు అమరావతికి వస్తాయని, ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లేవారు ఇకపై ఉద్యోగాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు వస్తారని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. మేము ప్రారంభించిన క్వాంటమ్‌ రిఫరెన్స్‌ ఫెసిలిటీస్‌ ద్వారా రాష్ట్రం హైటెక్‌ హబ్‌గా మారుతుందని ఆయన ఆకాంక్షించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story