కల్తీ నెయ్యి కేసులో సిట్ ఛార్జిషీట్‌పై వైకాపా దుష్ప్రచారం

CM Chandrababu: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం లేదంటూ సిట్ ఛార్జిషీట్‌లో పేర్కొన్నట్లు వైకాపా చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆధారాలతో ఖండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సభ్యులకు సూచించారు. పాలు లేకుండానే రసాయనాలు కలిపి నెయ్యి తయారు చేసే విధానం వైకాపా నేతలకు బాగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసి, భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వారికి తగిన శిక్ష పడాలని ఆయన స్పష్టం చేశారు.

'వైకాపా నేతలు మొదటి నుంచి నేరపూరిత వైఖరి కలిగి ఉన్నారు. ఆ పార్టీ నాయకుడే క్రిమినల్ లాంటి వ్యక్తి. కోడికత్తి, గులకరాయి, బాబాయ్ గుండెపోటు, గొడ్డలి వేటు, పరకామణి దొంగతనం వంటి అన్ని ఘటనలు వారు చేసి మనపై నెప్పు వేసే ప్రయత్నాలు చేశారు. దొంగలు దొంగ అని అరిచినట్లు ఇప్పుడు కల్తీ నెయ్యి విషయంలోనూ అదే తంతు చేస్తున్నారు' అని చంద్రబాబు వివరించారు. బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం అధ్యక్షతన 37 అంశాలపై చర్చ జరిగి ఆమోదం పొందింది. ఇందులో తితిదే లడ్డూ కల్తీ నెయ్యి విషయం, సిట్ ఛార్జిషీట్‌పై సుమారు 1.20 గంటల పాటు విస్తృత చర్చ సాగింది.

డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా కల్తీ నెయ్యి కేసు వివరాలను మంత్రివర్గానికి వివరించారు. ఛార్జిషీట్ ఇంకా అందలేదని చెప్పారు. తదుపరి సమావేశంలో దీనిపై చర్చించి వైకాపా అక్రమాలను ప్రజల ముందు బయటపెట్టాలని చంద్రబాబు సూచించారు. 'సిట్ ఏర్పాటును అడ్డుకోవాలని వైకాపా ప్రయత్నించింది. సీబీఐ విచారణ కోరింది కూడా వారే. తితిదే మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తన పేరు చేర్చారంటూ కోర్టును ఆశ్రయించారు. జగన్ తిరుమల వెళ్తానంటూ బయలుదేరి, డిక్లరేషన్ సంతకం చేయాల్సి వస్తుందని ఆగిపోయారు. వైకాపా హయాంలో తిరుమలలో కల్తీ నెయ్యి వినియోగం పూర్తి వివరాలు మంత్రులు తెలుసుకోవాలి. మాట్లాడేటప్పుడు పూర్తి ఆధారాలతో మాట్లాడాలి' అని ఆయన నిర్దేశించారు.

జంతువుల కొవ్వు కలిపినట్లు సిట్ విచారణలో తేలింది

లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు సిట్ విచారణలో వెల్లడైందని కొందరు మంత్రులు పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ సహా పలువురు తమ వద్ద ఉన్న సమాచారాన్ని చదివి వినిపించారు. నెయ్యి పరిమాణం తక్కువగా ఉండటం, రసాయనాలతో తయారు చేసినట్లు తేలిందని చెప్పారు. 2022లోనే కల్తీ నెయ్యి సరఫరా విషయం తితిదే అధికారులకు, ప్రభుత్వానికి తెలిసిందని మంత్రులు వివరించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 2019 నుంచి నెయ్యి సరఫరాలో జరిగిన మార్పులు, తేదీలతో సహా చర్చించారు. వాసన కోసం రసాయనాలు కలిపారని పేర్కొన్నారు.

'తితిదే కొనుగోలు కమిటీలో బోర్డు సభ్యులుగా నేను, ప్రశాంతిరెడ్డి ఉండేవాళ్లం. మమ్మల్ని సమావేశానికి పిలవకుండా నెయ్యి కొనుగోలు నిబంధనలు సరళీకరించి, కావాల్సిన వారికి టెండర్లు ఇచ్చారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, మరో అధికారి కలిసి నిర్ణయం తీసుకున్నారు' అని మంత్రి కొలుసు పార్థసారథి వివరించారు.

మంత్రివర్గం మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడంపై సంతాపం తెలిపింది. కల్తీ నెయ్యి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. మంత్రివర్గ సమావేశం ముందు పలువురు మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. విషయ పరిజ్ఞానంతోనే మాట్లాడాలని సీఎం సూచించారు. క్యాబినెట్ సమావేశం తర్వాత కూడా ఈ విషయంపై చర్చలు కొనసాగాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story