CM Chandrababu: చంద్రబాబు: దేశానికి గేట్‌వేలా మారుతున్న ఆంధ్రప్రదేశ్.. స్పేస్ సిటీ నుంచి గ్రీన్ హైడ్రోజన్ వరకు పెట్టుబడులతో అభివృద్ధి
స్పేస్ సిటీ నుంచి గ్రీన్ హైడ్రోజన్ వరకు పెట్టుబడులతో అభివృద్ధి

CM Chandrababu: దేశంలోనే అత్యందమైన నగరంగా విశాఖపట్నం పేరు తెచ్చుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. విశాఖలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో గురువారం జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో మాట్లాడుతూ, ఈ సమావేశానికి 72 దేశాల నుంచి ప్రతినిధులు చేరుకున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని పెట్టుబడిదారులకు అనుకూల గేట్‌వేలా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కేంద్ర ప్రధాని మోదీ పాలనలో దేశ ప్రజలకు విశ్వాసం పెరిగిందని ఆయన అన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలో నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా మారనుందని, ప్రజలు, వనరులు, సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకుంటే అది సాధ్యమేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
విశాఖ సురక్షిత నగరం.. ప్రపంచ దేశాలు భారత్ వైపు
సీఎం మాట్లాడుతూ, "విశాఖపట్నం దేశంలోనే అత్యందమైన నగరంగా గుర్తింపబడింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల దీన్ని సురక్షిత నగరంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ దేశానికి గేట్‌వేలా మారుతోంది. పెట్టుబడిదారుల లక్ష్యంగా మన రాష్ట్రం ఎదుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. పేదరికం, అసమానతలను తొలగించేందుకు అనేక చర్యలు చేపట్టాం. గ్రీన్ ఎనర్జీ వాడకం, స్వచ్ఛ ఆంధ్రా దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం" అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో భారతీయులే ముందంజలో ఉన్నారని, ఈ సామర్థ్యాన్ని మన రాష్ట్రం ఉపయోగించుకుంటోందని ఆయన తెలిపారు.
స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలు.. గ్రీన్ ఎనర్జీలో ముందంజలో ఏపీ
ఆంధ్రప్రదేశ్‌లో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ వంటి పెద్ద ప్రాజెక్టులు రానున్నాయని చంద్రబాబు ప్రకటించారు. "సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీల్లో మన రాష్ట్రం ముందంజలో ఉంది. అనేక కంపెనీలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తున్నాం" అని ఆయన వివరించారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు ఆకర్షితమవుతాయని, ఆర్థిక అభివృద్ధికి ఇది మైలురాయిగా నిలుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

