ప్రజల్లో కలిసిమెలిసి, మనసులు గెలుచుకుంటూ

CM Chandrababu as a Common Man: వైకాపా పాలనలో సీఎం జగన్‌ పర్యటన అనగానే చెట్లు కొట్టేయడం.. దారంతా పరదాలు కట్టేయడం, బారికేడ్లు పెట్టేయడం.. అడుగడుగునా పోలీసుల ఆంక్షల చట్రంలో ప్రజలు అల్లాడిపోయేవారు. వ్యాపారులు దుకాణాలు మూసేసి ఉసూరుమనేవారు. ఇందుకు పూర్తి భిన్నంగా తొలి నుంచి సీఎం చంద్రబాబు ప్రజలతో మమేకమవుతున్న తీరుతో ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఆదివారం జీఎస్టీ సంస్కరణలపై విజయవాడ బీసెంట్‌ రోడ్డుకు వచ్చిన ఆయన పర్యటన ఆసాంతం సామాన్యులను సైతం ఆకట్టుకుంది. కార్యక్రమం జరిగిన గంట సేపూ ప్రజలతో కలిసి ఓ సామాన్యుడిలా రోడ్డుపై తిరిగారు. దాదాపు 200 మీటర్ల మేర నడుస్తూనే దుకాణదారులు, వీధి వ్యాపారులను పలకరించి, వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా సీఎం వస్తున్నారన్న హడావుడి లేదు. చాలా పరిమిత ఆంక్షలతో ప్రజలు దుకాణాల్లో కొనుగోళ్లు చేసుకున్నారు. కొనుగోలుదారులను సీఎం ఆత్మీయంగా పలకరించి.. సెల్ఫీలకు అవకాశం ఇవ్వడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ గంట పాటు సీఎం సామాన్యుడైపోయినట్లు అనిపించింది.


గ్రేట్‌ అమరావతి షాపింగ్‌ ఫెస్టివల్‌ విజయవంతం

ఈనాడు, అమరావతి, భవానీపురం, న్యూస్‌టుడే: కృష్ణానది ఒడ్డున పున్నమిఘాట్‌ వద్ద నిర్వహించిన గ్రేట్‌ అమరావతి షాపింగ్‌ ఫెస్టివల్‌ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా ముగిసింది. పున్నమిఘాట్‌ వేదిగా సూపర్‌ జీఎస్టీ.. సూపర్‌ సేవింగ్స్‌ అంటూ వివిధ రకాల స్టాల్స్‌ను ఈ నెల 13వ తేదీ నుంచి ఏర్పాటు చేశారు. ముగింపు కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు హాజరయ్యారు. ప్రజల ఆదరణ పొందిన కొన్ని స్టాల్స్‌కు సీఎం అవార్డులను అందజేశారు. బెస్ట్‌ స్పాన్సర్‌ అవార్డు రామ్‌కో సిమెంట్స్‌కు, మోస్ట్‌ సేల్స్‌ స్టాల్‌గా రమా క్లాత్‌ స్టోర్, పాపులర్‌ స్టాల్‌గా వాక్య స్టాల్‌ ప్రతినిధులకు ప్రశంసా పత్రాలను అందించారు.

వెలుగుల్లో నదీతీరం.. దీపావళి పురస్కరించుకుని బాణసంచా వెలుగులతో నదీ తీరం కోలాహలంగా మారింది. చంద్రబాబు దంపతులు, నగర వాసులు ఆకాశంలో బాణసంచా మిరుమిట్లను తిలకించారు. ఘంటసాల పవన్‌కుమార్‌ బృందం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

పారిశ్రామికాభివృద్ధికి సీఎం కృషి

రాష్ట్రంలో పరిశ్రమలు పెరిగేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఎంపీ శివనాథ్‌ కొనియాడారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనే ఉద్దేశంతో చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఐటీ, ఫార్మా, పర్యాటక రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారని, మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు, ఎమ్మెల్యేలు యార్లగడ్డ, గద్దె, వసంత, కలెక్టర్‌ లక్ష్మీశ పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story