పలు అంతర్జాతీయ సంస్థలతో ఏపీకి కీలక ఒప్పందాలు

CM Chandrababu: భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు దిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సదస్సు సందర్భంగా ఏపీ ప్రభుత్వం పలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది. క్వాంటం కంప్యూటింగ్ మరియు ఏఐ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, మౌళిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి మొత్తం ఏడు ఒప్పందాలు జరిగాయి. ఇవి ఏపీని క్వాంటం-ఏఐ హబ్‌గా తీర్చిదిద్దడంతోపాటు అమరావతి క్వాంటం వ్యాలీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టేలా రూపొందించబడ్డాయి.

యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ (యూఎన్ఐసీసీ)తో ఒప్పందం ద్వారా క్వాంటం మరియు ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సెంటర్‌ను అమరావతి క్వాంటం వ్యాలీలో ఈ ఏడాది చివరి నాటికి స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యూఎన్ఐసీసీ డైరెక్టర్ సమీర్ చౌహాన్‌తో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు.

ఐబీఎం సంస్థతో కుదిరిన ఒప్పందం ప్రకారం, రాష్ట్రంలోని లక్ష మంది యువతకు క్వాంటం, ఏఐ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఐబీఎం గ్లోబల్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం ద్వారా ఐటీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు అందించడం జరుగుతుంది. భవిష్యత్ టెక్ వర్క్‌ఫోర్స్‌ను సిద్ధం చేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సదస్సులో ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్, దక్షిణాసియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాలాజీ, రీసెర్చ్ లాబ్స్ డైరెక్టర్ అమిత్ సింఘీ తదితరులు పాల్గొన్నారు.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ (నీలిట్)తో ఒప్పందం ద్వారా ఏపీలో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. దక్షిణ భారత్‌లో మొదటి ఏఐ మరియు క్వాంటం డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌ను స్థాపించడం ఈ ఒప్పందం లక్ష్యం. అలాగే, భారత్ జెన్-నెక్స్ జెన్-ఐబీఎంలతో కుదిరిన ఒప్పందం ప్రకారం రాష్ట్ర స్థాయి ఏఐ టెక్ హబ్ మరియు 5 లేయర్డ్ స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మాణం జరుగుతుంది. ఇది ప్రభుత్వ సంస్థలకు సేవలు అందించడంతోపాటు 22 భారతీయ భాషలను అనుసంధానం చేసే ప్లాట్‌ఫాం రూపకల్పనకు దారితీస్తుంది.

కాలిబో ఏఐ సంస్థతో ఒప్పందం ద్వారా ఏపీలోని 50 ఉన్నత విద్యా సంస్థల్లో ఏఐ మరియు క్వాంటం టెక్నాలజీని బలోపేతం చేయనున్నారు. ఏఐ అకాడెమీ మరియు ఏఐ శాండ్‌బాక్స్ ఏర్పాటు చేసి, గ్రాడ్యుయేట్ మరియు పీజీ విద్యార్థులకు అవగాహన, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏఐ ఇంటిగ్రేటెడ్ కరిక్యులమ్ మరియు నైపుణ్య శిక్షణపై దృష్టి సారిస్తుంది.

వైజర్ సంస్థతో కుదిరిన ఒప్పందం ప్రకారం అమరావతి క్వాంటం వ్యాలీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపన జరుగుతుంది. ఈ ఏడాది చివరి నాటికి 3.50 లక్షల మంది ఏఐ-క్వాంటం లెర్నర్లను, 2027 నాటికి 6 లక్షల మందిని సిద్ధం చేయడం లక్ష్యం.

ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం ద్వారా ఏపీలో ఏఐ ట్యూటర్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఏఐ ట్యూటర్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి మరియు ప్రొఫెసర్ మితేష్ పాల్గొన్నారు.

ఈ ఒప్పందాలు ఏపీని టెక్నాలజీ హబ్‌గా మార్చడంలో మైలురాయిగా నిలుస్తాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. యువతకు ఉద్యోగావకాశాలు పెరగడంతోపాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఇవి దోహదపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story