CM Chandrababu: పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచాలి: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

CM Chandrababu: పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో 'జీరో వేస్ట్' లక్ష్యాన్ని సాధించాలని, గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈరోజు సోమవారం రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక, పంచాయతీరాజ్, హోం, ఎక్సైజ్ తదితర శాఖల ద్వారా అందిస్తున్న ప్రభుత్వ సేవలపై చర్చించారు.
పెండింగ్ ఫిర్యాదులు తొలగించాలి
విశాఖపట్నం సముద్ర తీరంలో బోటు మునిగి మత్స్యకారులు గల్లంతైన ఘటనలో సంబంధిత విభాగాలు ఎంత త్వరగా స్పందించాయనేది కీలకమని సీఎం అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజాపాలనలో రాజకీయ నిర్వహణ - అధికారిక చర్యలు సమానంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్‌లో పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
మూడు నెలల్లో యూఎల్‌బీల్లో చెత్త సమస్య పరిష్కారం
మూడు నెలల్లో యూఎల్‌బీల్లో చెత్త తొలగింపు పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. గంజాయి నిర్మూలనపై తీసుకుంటున్న చర్యలను ప్రజలకు సమర్థవంతంగా తెలియజేయాలని సూచించారు. తాగునీరు సరఫరా, వ్యర్థాల సేకరణ, స్వచ్ఛ రథాలు, ఇంటింటికి చెత్త సేకరణ వంటి అంశాల్లో స్పష్టమైన ఎస్ఓపీలు జారీ చేయాలని ఆదేశించారు.
నెల రోజుల్లోగా అన్ని ప్రభుత్వ శాఖలు అవేర్ 2.0 ద్వారా సాధించిన ఫలితాలను విశ్లేషించాలని, రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనికేషన్ నెట్‌వర్క్ కనెక్టివిటీ మెరుగుపరచడానికి మారుమూల ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో పాలనలో వేగం, ప్రజల సమస్యల పరిష్కారంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు.

