CM Chandrababu: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీఎం పర్యటన సాగుతోంది. స్థానికులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. ప్రజల వద్దకు వెళ్లిన చంద్రబాబు వారిని ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పలువురు స్థానికులు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. అర్జీలను స్వీకరించిన సీఎం సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

నలగంపల్లె గ్రామంలో పర్యటించిన చంద్రబాబు, నెట్ జీరో (Net Zero) విధానాన్ని అవలంభిస్తున్న ఇళ్లను ప్రత్యేకంగా పరిశీలించారు. రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ, ఇండక్షన్ కుక్‌టాప్, టెర్రస్ గార్డెనింగ్, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించి, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పర్యావరణహిత పద్ధతులను పాటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఒక గ్రామస్థుడి ఇంటికి స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి సోలార్ విద్యుత్ వినియోగం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబం ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసింది.

కుప్పం ఏరియా ఆసుపత్రిలో సిటి స్కాన్ సెంటర్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం సంజీవని ఎగ్జిబిషన్ స్టాల్‌ను సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఆసుపత్రి ఆవరణలో వ్యర్థాలు, చెత్త ఉండటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై అసహనం తెలిపి, వ్యర్థాలు తొలగించి బెస్ట్ ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

బంగారు కుప్పం లక్ష్యం:

రాయలసీమలో రూ.లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇందులో ప్రైవేటు రంగం రూ.60 వేల కోట్లు, ప్రభుత్వం రూ.40 వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో రూ.117 కోట్లతో అధునాతన బస్ స్టేషన్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. బహిరంగ సభలో మాట్లాడుతూ కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.

“ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాల కోసం ఇక్కడికి వచ్చే స్థితి రావాలి. కుప్పం నుంచి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండకూడదు” అని ఆయన అన్నారు. రూ.9,320 కోట్లతో 30 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశామని, వ్యవసాయంలో సెరీ కల్చర్ దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. పూర్తి వాణిజ్య పంటలు, ఇంటిపై కూరగాయలు పండించుకోవడం, విద్యుత్ వాహనాలు, సోలార్ ద్వారా ఆర్టీసీ బస్సులకు విద్యుత్ ఉత్పత్తి వంటి ఆధునిక విధానాలను ప్రోత్సహిస్తామన్నారు.

పౌల్ట్రీ రైతులకు చేయూత, అడిడాస్ పరిశ్రమ ద్వారా 20 వేల ఉపాధి అవకాశాలు, డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తామని చంద్రబాబు ప్రకటించారు. “త్వరలో కుప్పంలో బంగారం ఉత్పత్తి చేసి స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతాం” అని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.

ఈ పర్యటన స్థానికుల్లో ఉత్సాహం నింపింది. అభివృద్ధి, ఉపాధి, పర్యావరణ హితం కలిపిన సమగ్ర అభివృద్ధి ద్వారా కుప్పం స్వర్ణ యుగంలోకి అడుగుపెడుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story