CM Chandrababu: రాష్ట్రంలో భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడమే లక్ష్యంగా 2027 మార్చి నాటికి భూముల సర్వే, సెక్యూరిటీ ప్రింటింగ్, బ్లాక్‌ చైన్, క్యూఆర్ కోడ్ ఆధారిత భూ వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు సూచించారు.

జిల్లా కలెక్టర్ల సదస్సులో భూపరిపాలన అంశంపై చర్చ జరిగింది. భూపరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి ప్రెజెంటేషన్ ఇచ్చిన అనంతరం సీఎం మాట్లాడుతూ, “భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి ఈ అంశాలను పూర్తి చేయాలి” అని ఆదేశించారు.

కోర్టుల్లో ప్రభుత్వం తరపున 4 లక్షల భూ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ భూములు ఆక్రమణల నుంచి కాపాడలేకపోతే ఆదాయం కూడా నష్టపోతామని సీఎం హెచ్చరించారు. శెట్టిపల్లి కలెక్టర్ భూ వివాదం పరిష్కరించిన తీరును ఉదాహరణగా చెప్పి, మిగిలిన జిల్లాల్లోనూ అదే రీతిలో దృష్టి సారించాలని సూచించారు.

జిల్లా కార్యాలయాలకు భవనాల సమస్య ఉంటే మోడల్ ఆఫీసులు నిర్మించాలని, 22ఏ భూముల వివాదాలు త్వరగా పరిష్కరించి, ప్రభుత్వ ఇళ్ల పట్టాలు సర్వే చేసి అందించాలని చంద్రబాబు ఆదేశించారు.

భూపరిపాలన కమిషనర్ వివరాలు:

ఇంతకుముందు సదస్సు తర్వాత 2,995 దరఖాస్తులు పరిష్కరించగా, 1,485 ఆమోదించి మిగిలినవి తిరస్కరించారు.

2024 జూన్ నుంచి 5,739 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

2026 మే వరకు 6,070 గ్రామాల్లో 24.62 లక్షల పట్టాదారు పాసుపుస్తకాలు అందించారు.

పాత రికార్డుల డిజిటలీకరణ మూడు దశల్లో 2026 డిసెంబరు నాటికి పూర్తి చేయనున్నారు.

శాంతిభద్రతలపై సమీక్ష

కలెక్టర్ల సదస్సులో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, రహదారి భద్రత, సైబర్ నేరాలపై సమీక్షించారు. టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌పై కమిటీ ఏర్పాటు, ఎస్పీలు ఫోరెన్సిక్-సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, రహదారి ప్రమాదాల నివారణపై మరింత శ్రద్ధ వహించాలని సూచించారు.

నేరాల్లో శిక్షల శాతం 49.8 నుంచి 70 శాతానికి పెంచాలని లక్ష్యం నిర్దేశించారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేస్తామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు.

ఈ సదస్సులో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story