రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అధికారులకు డైరెక్షన్

CM Chandrababu: విద్యుత్ అవసరాలకు తగ్గట్టు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సెక్రటారియట్‌లో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీలో ఖర్చులు తగ్గించేందుకు అమలు చేస్తున్న చర్యలపై సమీక్షించారు. ఈ సమీక్షలో ప్రసరణ నష్టాలను తగ్గించడంపై దృష్టి పెట్టిన సీఎం, గత ప్రభుత్వ విధానాలు విద్యుత్ రంగాన్ని దెబ్బతీశాయని విమర్శించారు.

విద్యుత్ రంగంలో ఖర్చులు తగ్గించడం, సమర్థవంతమైన సరఫరా కల్పించడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రసరణ నష్టాలను గణనీయంగా తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ కొనుగోళ్ల భారాన్ని తగ్గించేందుకు ఎంఓయూలు (MoUs) కుదుర్చుకోవాలని, ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఎంఓయూలు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పీఎం కుసుమ్, రూఫ్‌టాప్ ప్రాజెక్టులు వేగంగా అమలు చేయాలని ఆదేశించారు.

ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులు 60 రోజుల్లో కార్యాచరణ ప్రారంభించేలా చూడాలని సీఎం చెప్పారు. ఫెరో అల్లాయ్ పరిశ్రమలకు మరో ఏడాది ప్రోత్సాహకాలు కొనసాగించాలని, థర్మల్ పవర్ స్టేషన్లలోని బూడిదను వివిధ అవసరాలకు వినియోగించాలని సూచించారు. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టాలని, ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల్లో విద్యుత్ పొదుపు పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

గత వైసీఆర్‌సీపీ ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలతో విద్యుత్ రంగాన్ని అస్తవ్యస్తం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. పీపీఏలు (PPAs) రద్దు చేయడంతో రూ.9,000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందని, విద్యుత్ వినియోగించకుండానే ప్రజాధనాన్ని కంపెనీలకు చెల్లించిందని ఆరోపించారు. ఈ తప్పులు విద్యుత్ రంగాన్ని దెబ్బతీశాయని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని సరిచేస్తూ ముందుకు సాగుతోందని చెప్పారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story